ఆదివారం 24 జనవరి 2021
Crime - Dec 14, 2020 , 18:34:21

గుజరాత్‌ మాజీ హోంమంత్రి విపుల్ చౌదరి అరెస్ట్‌, 4 రోజుల రిమాండ్‌

గుజరాత్‌ మాజీ హోంమంత్రి విపుల్ చౌదరి అరెస్ట్‌, 4 రోజుల రిమాండ్‌

అహ్మదాబాద్‌ : ఉత్తర గుజరాత్‌లోని సాగర్ డెయిరీ మాజీ చైర్మన్, మాజీ హోంమంత్రి విపుల్ చౌదరిని సీఐడీ పోలీసులు అవినీతి కేసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఎదుట ప్రవేశపెట్టడంతో.. కోర్టు ఆయనకు నాలుగు రోజుల రిమాండ్‌ విధించింది.  డెయిరీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు విపుల్‌ చౌదరిపై అభియోగాలు ఉన్నాయి. 

మిల్క్ సాగర్ డెయిరీ మాజీ చైర్మన్ విపుల్ చౌదరి, ప్రస్తుత చైర్మన్ ఆశా ఠాకూర్, వైస్ ప్రెసిడెంట్ మొఘాజీ ఠాకూర్, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర అధికారులు కలిసి 1932 మంది ఉద్యోగులకు రూ.15 కోట్లు అదనపు బోనస్‌గా ఇచ్చి విపుల్ చౌదరి ఖాతాలో సగం కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఈ కేసులో భగవాన్ భాయ్ చౌదరి.. మెహ్సానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ఉచిత న్యూట్రిషన్‌ దాణా పంపడం అవినీతి కాదు

విపుల్‌ చౌదరి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంలో కరవు సమయంలో మహారాష్ట్రకు ఉచిత న్యూట్రిషన్‌ దాణా పంపడం అవినీతి కాదని విపుల్ చౌదరి చెప్పారు. కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం వారు తమ భూములను తాకట్టు పెట్టి డబ్బు వసూలు చేయడం ద్వారా ఇప్పటివరకు రూ.11 కోట్ల 25 లక్షలు వసూలు చేశారు. మెహ్సానా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా ఉన్న విపుల్ చౌదరి.. 2013 లో సాగర్దానాను మహారాష్ట్రకు సుమారు రూ.22,50 కోట్ల ధరకు పంపారు. 2014 లో కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు జారీ చేయగా, రిజిస్ట్రార్ చౌదరికి 2015 జనవరిలో నోటీసు పంపారు. దీనిపై, జూలై 2018 లో కోఆపరేటివ్‌ ట్రిబ్యునల్ చౌదరిని నిషేధించి, 2018 అక్టోబర్ నాటికి రూ.9 కోట్ల 10 లక్షలు జమ చేయాలని ఆదేశించింది.

జనవరి ఐదున ఎన్నికలు

ఇలాఉండగా, సుమారు 5.20 లక్షల పశువుల కాపరులు ఉత్తర గుజరాత్‌లోని అతిపెద్ద పాల డెయిరీ అయిన సాగర్ డెయిరీతో సంబంధం కలిగి ఉన్నారు. దీని వార్షిక టర్నోవర్ రూ.4,254 కోట్లు. ఈ సంస్థకు ఎన్నికలు జనవరి 5 న జరగనున్నాయి. విపుల్ చౌదరి మళ్లీ డెయిరీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో డెయిరీలో అవకతవకలు, అవినీతి కేసులో అతడిని అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo