సోమవారం 13 జూలై 2020
Crime - May 25, 2020 , 22:41:06

వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాంల్లో ఐదుగురి మృతి

వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాంల్లో ఐదుగురి మృతి

హైదరాబాద్‌ : వడదెబ్బ తగిలి ఉపాధి హామీ కూలీ మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని చందూర్‌ మండల కేంద్రంలో  చోటు చేసుకుంది. చందూర్‌ గ్రామానికి చెందిన బర్ల సాయవ్వ (52) చెరువులో పూడిక పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయింది. ఇతర కూలీలు వెంటనే సాయవ్వను స్థానికంగా ఉన్నపీఎంపీ వద్దకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వడదెబ్బ తగలడంతోనే  సాయవ్వ మృతి చెందినట్లు తెలిపారు. సాయవ్వ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఏరియా దవాఖానకు తరలించారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని జోగాపూర్‌ గ్రామానికి చెందిన నిట్టు కొమురయ్య (38) వడదెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం.. కొమురయ్య ఆదివారం తన పొలంలో పని చేసుకుంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతదేహానని పోస్ట్‌మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కొమురయ్యకు భార్య జల, ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. 

 ట్రాలీ ఆటో కార్మికుడి మృతి..

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి సమీపంలో నివసించే ట్రాలీ ఆటో కార్మికుడు మధిరె సంపత్‌(54) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాలీ ఆటో నడుపుకొని భార్య, కొడుకు, కూతురును పోషించుకునే సంపత్‌ ఆదివారం ఎండలో పాపారావుబొంద వద్ద గిరాకీ కోసం ఎదురుచూశాడు. దీంతో వడదెబ్బకు గురికాగా సాయంత్రం కుటుంబ సభ్యులు దవాఖానలో చేయించుకుని ఇంటికి తీసుకు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో దవాఖానకు తరలించే క్రమంలోనే సంపత్‌ మృతి చెందాడు. 

వనపర్తి జిల్లాలో గొర్రెల కాపరి..

 వడదెబ్బకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. గోపాల్‌పేట మండలం చాకల్‌పల్లి గ్రామానికి చెందిన ఎద్దుల గొల్ల దేవయ్య(45) గొర్రెలను మేపేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో వడ దెబ్బ తగిలి అక్కడే మృతి చెందాడు. అలాగే రేవల్లి మండల కేంద్రానికి చెందిన సాయిలు(60) వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత బహిర్బూమికి వెళ్లి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. 


logo