మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Oct 18, 2020 , 21:27:06

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు : ఐదుగురు నక్సల్స్‌ హతం

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు : ఐదుగురు నక్సల్స్‌ హతం

ముంబై : గడ్చిరోలి జిల్లాలోని గయారాపట్టి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమయ్యారు. మహారాష్ట్ర పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో కోస్మి-కిస్నేలి అడవిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో గడ్చిరోలి పోలీసు విభాగానికి చెందిన సీ-60 కమాండోలు పాల్గొన్నారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ ఏడాది జరిపిన అతిపెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటి. 

గడ్చిరోలి పోలీసులకు చెందిన సీ-60 కమాండోలు ధనోరా తాలూకాలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసిన నక్సల్స్ పారిపోతూ కాల్పులు జరిపారు. అయితే, పోలీసు బృందం ప్రతీకారంగా కాల్పులు జరిపింది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఘటనస్థలంలో చూడగా ఐదుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ సంఘటన తరువాత గడ్చిరోలి పోలీసులు అడవిలో నక్సల్ వ్యతిరేక చర్యలను ముమ్మరం చేశారని గడ్చిరోలి పోలీస్‌ సూపరింటెండెంట్‌ చెప్పారు. ఇలాఉండగా, తెలంగాణలోని ములుగు జిల్లాలో ఆదివారం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని అటవీ ప్రాంతాన్ని కూంబింగ్‌ చేస్తున్న ప్రత్యేక పోలీసు పార్టీలకు నక్సలైట్లు తారసపడ్డారు. లొంగిపోవాల్సిందిగా సూచించినా.. కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. కాగా, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo