సోమవారం 26 అక్టోబర్ 2020
Crime - Sep 23, 2020 , 18:39:58

పట్టపగలే గుప్త నిధుల తవ్వకాలు..ఐదుగురి అరెస్ట్

పట్టపగలే గుప్త నిధుల తవ్వకాలు..ఐదుగురి అరెస్ట్

నాగర్‌కర్నూల్‌ : పట్టపగలే గుప్త నిధుల తవ్వకాలు చేపట్టిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న సంఘటన జిల్లాలోని వెల్దండ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెల్దండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని మజీద్‌ వెనకాల ఉన్న పాడుబడ్డ ఇంట్లో కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు గుప్తనిధుల తవ్వకాలు చేపట్టారు. గతంలో ఆలయంగా ఉండటంతో అందులో గుప్త నిధులు ఉన్నాయని నమ్మి పట్టపగలే తవ్వుతుండగా శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు తెలియజేసి ఐదుగురిని పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు.

ఐదుగురిని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన గండి శ్రీనివాసులు, ఉప్పల్‌కు చెందిన శంకర్‌, భూపాలపల్లి జిల్లా, నాగారం గ్రామానికి చెందిన దేవేందర్‌, హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన సత్తయ్య, పోతారం గ్రామం, హుస్నాబాద్‌ మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన వెంకట్‌రాజన్‌ ఉన్నారు. వీరందరూ హైదరాబాద్‌ బోడ్డుప్పల్‌లో వివిధ పనులు చేస్తూ ఉండేవారు. వీరికి సిద్దిపేట జిల్లాకు చెందిన రవి అనే వ్యక్తి ద్వారా వెల్దండకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నర్సింహులు తెలిపారు.logo