సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 10:43:04

కరోనిల్‌ టాబ్లెట్‌: రాందేవ్‌ బాబాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కరోనిల్‌ టాబ్లెట్‌: రాందేవ్‌ బాబాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

జైపూర్‌: కరోనా చికిత్స కోసం 'కరోనిల్' అనే ఔషధాన్ని తయారు చేశామని యోగా గురు రాందేవ్‌ బాబాకు చెందిన  పతంజలి సంస్థ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్-19కి ఈ మందుతో ఆయుర్వేద చికిత్స చేయొచ్చని పతంజలి చెబుతున్నది. కరోనా మందుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో  సెక్షన్‌  420(చీటింగ్‌) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.   రాందేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ సహా ఐదుగురిపై రాజస్థాన్‌లో ఈ కేసు నమోదైంది. కరోనాను కరోనిల్‌ మందు నివారిస్తుందని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదు చేయడంతో జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

రాందేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ, శాస్త్రవేత్త అనురాగ్, నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమర్, నిమ్స్ డైరెక్టర్ అనురాగ్ తోమర్‌పై జ్యోతీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ  ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సుధీర్‌ కుమార్‌ తెలిపారు. కరోనిల్‌ పేరుతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశామని చెప్పారు. 

ఔషధాలను నిశితంగా పరిశీలించేవరకూ వాటి గురించి ప్రకటనలు, ప్రచారం నిలిపివేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించిన విషయం తెలిసిందే.  మరోవైపు క‌రోనాకు ఔషధం పేరుతో ప‌తంజ‌లి ప్ర‌క‌టించిన క‌రోనిల్‌పై  క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన ప్రైవేటు ఆస్ప‌త్రికి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది.


logo