గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 08, 2020 , 19:38:42

యువజంటను బలిగొన్న ఆర్థిక సమస్యలు

యువజంటను బలిగొన్న ఆర్థిక సమస్యలు

కొడైకెనాల్‌ : ఖమ్మం జిల్లాకు చెందిన యువజంట కొడైకెనాల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలివి.. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ (25), భద్రాచలం మండలం చోడవరానికి చెందిన ఏపూరి నందిని 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది నుంచి కొడైకెనాల్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తూ  అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాదిగా నివాసముంటున్నారు. రెండురోజులుగా వీరు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇరుగుపొరుగు ఫోన్ చేసినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా విగత జీవులుగా పడి ఉన్నారు.

లాక్‌డౌన్ కారణంగా దంపతులిద్దరూ ఉద్యోగాలు కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం. నందిని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కుదర్లేదని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నారని.. నందినికి అక్కడ ఉద్యోగం వచ్చినా విమానాలు అందుబాటులో లేక వెళ్లడం కుదరలేదు. ఇంటికి తిరిగి రాలేక.. అటు ఆస్ట్రేలియా వెళ్లలేక.. చేతిలో డబ్బులు లేక తీవ్ర మనోవేదనకు గురైన ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. డబ్బు లేకపోవడంతో కొంతకాలంగా వీరు సెల్‌ఫోన్లు సైతం రీఛార్జ్ చేయలేదని.. ఇంట్లో డబ్బు లేదని సమాచారం. పొలీసులు వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగులో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


logo