మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 17:31:20

గుజరాత్ లో భర్తకు తలాక్ చెప్పిన భార్య

గుజరాత్ లో భర్తకు తలాక్ చెప్పిన భార్య

అహ్మదాబాద్ : ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని చట్టం తీసుకువచ్చినప్పటికీ.. ఇన్ స్టంట్ తలాక్ లు చెప్పేసి బంధాలను తెంచుకుంటున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా, ఓ 32 ఏండ్ల మహిళ.. భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయింది. అంతేకాకుండా ఆయనపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది.

వెలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే షేర్ఖాన్ పఠాన్ ..భార్య ముమ్తాజ్ షేక్ ను తీవ్ర హింసకు గురిచేసేవాడు. దాంతో విసుగుచెందిన భార్య ముమ్తాజా.. తన ముగ్గురు పిల్లలను తీసుకుని అమ్మగారింటికి వెళ్లిపోయింది. తనను తీసుకెళ్లేందుకు వచ్చిన భర్తకు ట్రిపుల్ తలాక్ చెప్పేసింది. దాంతో తనపై భార్య తండ్రి దాడికి పాల్పడ్డాడంటూ పఠాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు తనను తీవ్రంగా హింసలకు గురిచేసేవాడంటూ అహ్మదాబాద్ లో భర్తపై గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. 

"ఈ తలాక్ మన దేశ చట్టాల ప్రకారం లేదా ఇస్లామిక్ కోడ్ క్రింద చట్టబద్ధమైనదిగా పరిగణించబడదు. కానీ ఆమె, ఆమె కుటుంబం దీనిని విడాకులుగా భావించారు” అని వెలాపూర్ పోలీసు ఇన్స్పెక్టర్ ఎల్డి ఒడెడారా చెప్పారు.

మహిళలు తక్షణ తలాక్ ఇవ్వలేరు: మతాధికారులు

ఇలాఉండగా, ఇస్లామిక్ చట్టాలు ఒక మహిళ తన భర్తకు విడాకులు ఇవ్వడానికి అనుమతించనందున అలాంటి విడాకులు చట్టవిరుద్ధం అని ఇస్లామిక్ మతాధికారి ముఫ్తీ అస్జాద్ కస్మి అన్నారు. వివాహాన్ని నిర్వహించడానికి లేదా ముగించే హక్కు ఇస్లామిక్ చట్టాల ప్రకారం భర్తకు మాత్రమే ఉంటుందని మరో మతాధికారి ముఫ్తీ షబ్బీర్ పేర్కొన్నారు. చట్టం వచ్చినప్పటికీ ట్రిపుల్ తలాక్ లు ఇంకా కొనసాగుతుండటం పట్ల పలువురు జాతీయవాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు.


logo