రాయ్‌పూర్ : పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో లైంగిక దాడి కేసులో నిందితుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జార్ఖండ్‌లోని పశ్చి సింగ్భం జిల్లాలోని బర్కెలా గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సోనారాం గోపె మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత ఏడాది నవంబర్‌లో చైబాస ముఫసిల్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక లైంగిక దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో గోపె ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపు మూసి గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి నిందితుడిని హుటాహుటిన జంషెడ్‌పూర్‌లోని దవాఖానకు తరలించగా వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్‌కు తీసుకువెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు నాలుగు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. కోర్టు సైతం నిందితుడిపై వారెంట్ జారీ చేసిందని చెప్పారు. కాగా, తాను ఎవరిపై లైంగిక దాడికి పాల్పడలేదని, తనను తప్పుడు కేసులో ఇరికించారని నిందితుడు ఆరోపిస్తున్నాడు. గ్రామంలో పోలీసులను చూసి తనను అరెస్ట్ చేసేందుకు వచ్చారనే భయంతో ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు.