మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 04, 2020 , 11:11:31

ఆడ‌పిల్ల‌లు పుట్టార‌ని విషం తాగించిన తండ్రి

ఆడ‌పిల్ల‌లు పుట్టార‌ని విషం తాగించిన తండ్రి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌: ‌పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని తెలిస్తేచాలు.. ఆ పిండాన్ని త‌ల్లి గ‌ర్భంలోనే చిధిమేస్తున్నారు కొంద‌రు. అవాంత‌రాల‌న్నింటినీ ఎదుర్కొని భూమి మీదికి వ‌చ్చిన త‌ర్వాతకూడా వారిని అనంత లోకాల‌కు పంపిస్తున్నారు మ‌రికొంద‌రు. తాజాగా ఒకే కాన్పులో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు జ‌న్మించ‌డంతో త‌ట్టుకోలేక‌ ఆ శిశువుల‌కు విష‌మిచ్చాడో తండ్రి. ఈ విషాద సంఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా గండేడ్ మండ‌లంలో చోటుచేసుకున్న‌ది. 

మండ‌లంలోని దేశాయిప‌ల్లికి చెందిన కృష్ణ‌వేణి, కేశ‌వులు దంప‌తుల‌కు ఈ నెల 1న రాత్రి క‌వ‌ల ఆడ‌పిల్ల‌లు జ‌న్మించారు. అప్ప‌టికే వారికి ఒక కూతురు ఉన్న‌ది. రెండో కాన్పులోనూ క‌వ‌ల ఆడ‌శిశువులే పుట్టార‌ని కేశ‌వులు ఆవేద‌నచెందాడు. కోపంతో ఆ శిశువుల‌ను చంపేందుకు య‌త్నించాడు. దీంతో భార్య‌కు తెలియ‌కుండా రోజుల క‌వ‌ల ఆడ శిశువుల‌కు పురుగుల మందు తాగించాడు.  

పిల్ల‌లు అప‌స్మార‌క స్థితిలోకి చేరుకోవ‌డంతో ఆ శిశువుల‌ను పిల్ల‌ల ద‌వాఖాన‌లో అడ్మిట్ చేశాడు. ప‌రిశీలించిన వైద్యులు వారిద్ద‌రికి పాయిజ‌న్ అయిన‌ట్లు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ద‌వాఖాన‌కు శిశువుల‌ను త‌ర‌లించారు. 

అయితే కేశ‌వులు పురుగుల మందు డ‌బ్బా కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు చిన్నారులు జిల్లా కేంద్ర ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. 


logo