శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Crime - Mar 06, 2020 , 18:04:31

ఆ ముగ్గురిని నాన్నే చంపేశాడు!

ఆ ముగ్గురిని నాన్నే చంపేశాడు!

కన్న కూతుళ్ల పాలిట తండ్రే కాలయముడయ్యాడు. కర్కశంగా ముగ్గురు కూతుళ్లను పొట్టన పెట్టుకున్నాడు. చెరువులో ముంచి హత్య చేశాడు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ దారుణం అందరినీ కలచి వేసింది. బాన్సువాడ మండలం తాడ్కోల్‌ గ్రామానికి చెందిన నీలోఫర్‌, ఫయాజ్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నాల్గవ సంతానంలో ఇద్దరు కవలలు పుట్టారు. వీరిలో ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆడపిల్లను చిన్నపుడే దత్తత ఇచ్చారు. మద్యం, పేకాటకు ఫయాజ్‌ బానిస అయ్యాడు. దీంతో ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుండేవి. తాడ్కోల్‌కు నిన్న(గురువారం) వేరే కేసులో విచారణ కోసం పోలీసులు రాగా ఫయాజ్‌ భార్య అతని గురించి వారికి ఫిర్యాదు చేసింది.

తనపై పోలీసులకు  ఫిర్యాదు చేసిందన్న విషయాన్ని మనసులో పెట్టుకున్న ఫయాజ్‌ మరుసటి రోజు ఉదయం కందోరు పండుగ ఉందని చెప్పి నలుగురు పిల్లలను చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. తండ్రి ప్రవర్తనపై భయపడ్డ కుమారుడు తప్పించుకొని ఇంటికి వచ్చాడు. ముగ్గురు ఆడపిల్లలు కనిపించకపోయేసరికి నీలోఫర్‌ వారికోసం గాలిస్తుండగా తడిసిన బట్టలతో ఫయాజ్‌ కనిపించాడు. అనుమానం వచ్చిన నీలోఫర్‌ చెరువు వద్దకు వెళ్లి చూసింది. అక్కడ పిల్లల చెప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని ఆమె గ్రామస్తులకు చెప్పింది. స్థానికులు చెరువులో వెతకగా అఫియా(10,  మహిమ్‌(9), జోయా(7)ల మృతదేహాలు దొరికాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టంకు పంపారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ముగ్గురు అక్కాచెల్లెళ్ల హత్య!


logo