మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 29, 2020 , 14:05:11

జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీకి విఫలయత్నం.. సినీ ఫక్కీలో చేజ్‌ చేసి అరెస్టు చేసిన పోలీసులు

జ్యువెల్లరీ దుకాణంలో దోపిడీకి విఫలయత్నం.. సినీ ఫక్కీలో చేజ్‌ చేసి అరెస్టు చేసిన పోలీసులు

న్యూఢిల్లీ : పశ్చిమ ఢిల్లీలోని ఒక ఆభరణాల దుకాణంలో దోపిడీకి పాల్పడిన తరువాత దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సినీ ఫక్కీలో వారిని వెంబడించిన పోలీసు బృందంపై కాల్పులు జరిపిన నలుగురిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో నజాఫ్‌గర్‌కు చెందిన సెజాజాద్ (21), మహ్మద్ అనాస్ (22)కాగా  మిగతా ఇద్దరు ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందినవారని వారు తెలిపారు.

పోలీసుల వివరాలు.. సోమవారం సాయంత్రం తిలక్ నగర్‌లోని ఒక ఆభరణాల దుకాణంలోకి నలుగురు ప్రవేశించి దోచుకోవడానికి ప్రయత్నించారు. దుకాణ యజమాని, సిబ్బంది,  వినియోగదారుల ప్రతిఘటన కారణంగా వారి ప్రయత్నం విఫలమైంది. తరువాత అనాస్ ఒక కస్టమర్‌పై కాల్పులు జరిపి అనంతరం దుకాణం నుంచి ముఠా పారిపోయింది. ఐ20 కారులో పారిపోతున్న దొంగల గురించి సమాచారం అందిన పోలీసులు పటేల్ నగర్ సమీపంలోని షాడిపూర్ మెట్రో స్టేషన్ వద్ద వారిని గుర్తించారు.

బైక్‌పై వచ్చి పోలీసులు వారిని అడ్డగించడంతో బైక్‌ను కారుతో ఢీకొట్టి వేగంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరో బైక్‌పై ఇద్దరు పోలీసులు వారిని వెంబడించారు. వెంటనే దుండగులు కారు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వారిలో ఇద్దరు సౌత్ పటేల్ నగర్ వద్ద ఓ ఇంటిలోకి చొరబడ్డారు. పోలీసులు ఇంటిని చుట్టుముట్టగా నిందితుల్లో ఒకరు పోలీసు బృందంపై కాల్పులు జరిపారు. పోలీసులు తిరిగి కాల్పులు జరిపి వారిని అరెస్టు చేశారు. 

సెంట్రల్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సంజయ్ భాటియా కూడా అప్పటికి అక్కడికి చేరుకుని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ రోహిత్ మీనా తెలిపారు. నాల్లో నిందితుడైన మనీశ్‌ను కూడా తరువాత గుర్తించి ఉత్తమ్ నగర్ ప్రాంతం నుంచి అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. వారి ఐదో సహచరుడు నదీమ్ ఇంకా పరారీలో ఉన్నాడు.logo