సోమవారం 18 జనవరి 2021
Crime - Oct 03, 2020 , 13:10:15

ఫేస్‌బుక్ న‌కిలీ ఖాతాల‌తో దందా.. రాజ‌స్థాన్ గ్యాంగ్ అరెస్ట్

ఫేస్‌బుక్ న‌కిలీ ఖాతాల‌తో దందా.. రాజ‌స్థాన్ గ్యాంగ్ అరెస్ట్

న‌ల్ల‌గొండ : ఫేస్‌బుక్ న‌కిలీ ఖాతాల‌తో దందా కొన‌సాగిస్తున్న రాజస్థాన్‌కు చెందిన న‌లుగురు స‌భ్యుల ముఠాను న‌ల్ల‌గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను న‌ల్ల‌గొండ ఎస్పీ రంగ‌నాథ్ మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. 

ఈ సంద‌ర్భంగా ఎస్పీ రంగ‌నాథ్ మాట్లాడుతూ.. రాజ‌స్థాన్‌లోని భ‌ర‌త్‌పూర్ జిల్లా కేత్వాడ గ్రామానికి చెందిన న‌లుగురు యువ‌కులు క‌లిసి ఓఎల్ఎక్స్, ఫేస్‌బుక్ వేదిక‌గా మోసాల‌కు పాల్ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో న‌కిలీ ఖాతాల‌ను పోలీసు అధికారుల పేరిట సృష్టించి.. డ‌బ్బులు పంపాల‌ని కోర‌డం ప‌నిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా, తెలంగాణ‌, ఏపీ, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌, హ‌ర్యానా రాష్ర్టాల‌కు చెందిన పోలీసు అధికారుల‌తో పాటు బ్యాంకు, రైల్వే, సీఆర్పీఎఫ్ అధికారుల పేరిట న‌కిలీ ఖాతాలు సృష్టించి మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిపారు. ఆర్మీ పేరుతో సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డ్డారు. ఇదే ముఠా ఇటీవ‌ల త‌న పేరిట కూడా ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించి డ‌బ్బులు పంపాల‌ని ప‌లువురికి రిక్వెస్ట్ పెట్టార‌ని ఎస్పీ రంగ‌నాథ్ పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ. ల‌క్ష న‌గ‌దు, 8 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌, 30 సిమ్ కార్డులు, ఆధార్‌కార్డుల‌తో పాటు ప‌లు డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ తెలిపారు.