గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jun 30, 2020 , 14:47:53

13 హత్యలు, 50 లైంగికదాడులకు పాల్పడ్డ మాజీ పోలీస్‌

13 హత్యలు, 50 లైంగికదాడులకు పాల్పడ్డ మాజీ పోలీస్‌

లాస్ ఏంజిల్స్ : పలు హత్యలు, లైంగికదాడులకు పాల్పడిన అమెరికాకు చెందిన ఓ మాజీ పోలీసును స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. గోల్డెన్ స్టేట్ కిల్లర్‌గా పేరుగాంచిన జోసెఫ్ జేమ్స్ డాంగెలో జూనియర్.. డజన్ల కొద్దీ లైంగికదాడులు, దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఈ హృదయ విదారక నేరాలు కాలిఫోర్నియాలో 20 ఏండ్లుగా స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. జోసెఫ్ అరాచకాలు 1970-1980 లలో రాష్ట్రంలో కొనసాగడంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జీవించారు. 

సాక్రమెంటోలోని కోర్టు విచారణలో అతని నేరాలకు సంబంధించిన భయంకరమైన వివరాలను ప్రాసిక్యూటర్‌ చదివి వినిపించారు. జోసెఫ్ నేరానికి పాల్పడిన ప్రతిసారీ తప్పించుకొన్నాడని, నిశ్శబ్దంగా రాత్రుల్లో పారిపోతాడని, ఆయన చేసిన నేరాలకు సమాజం చాలా భయపడిందని ప్రాసిక్యూటర్ థియన్ హో చెప్పారు. ఆరెంజ్ జంప్‌ సూట్ ధరించి కోర్టుకు హాజరైన 74 ఏళ్ల జోసెఫ్ న్యాయమూర్తికి ప్రతిస్పందనగా.. "అవును", "లేదు," "నేను అంగీకరిస్తున్నాను" అని ముక్తసరిగా చెప్పాడు.

మరణశిక్షను తొలగించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, మాజీ పోలీసుకు పెరోల్ లేకుండా వరుసగా 11 జీవిత ఖైదులు విధించినట్లు మరో ప్రాసిక్యూటర్ అమీ హాలిడే తెలిపారు. జోసెఫ్ చేసిన నేరాలలో 13 హత్యలు, దాదాపు 50 లైంగికదాడులు, డజన్ల కొద్దీ దోపిడీ సంఘటనలు ఉన్నాయని చెప్పారు."గోల్డెన్ స్టేట్ కిల్లర్" చివరిసారిగా చేసిన నేరం తర్వాత 30 ఏండ్లకు 2018 లో అరెస్టయ్యాడు. 1978 లో కొత్తగా వివాహం చేసుకొన్న బ్రియాన్, కేటీ మాగిగోర్ హత్యతో జోసెఫ్‌పై తొలుత అభియోగాలు నమోదయ్యాయి. 


logo