హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నిషేధించబడిన పొగాకు ఉత్పత్తులను దక్షిణ మండల పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఘట్టీషేరాన్ ప్రాంతంలో లక్కీ కలెక్షన్ దుకాణంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో గురువారం సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వెబ్ స్మోక్ సిల్వర్ బ్లాక్ ఈ-సిగరెట్లు(32 బాక్సులు), 1 జాయ్ డైమండ్ బేబీ టాయ్ ఈ-సిగరెట్లు(33 బాక్సులు), అల్ ఫక్రీ జ్యూస్ ఫ్లేవర్ 20 బాక్సులు(ఒక్కో బాక్సులో 10 బాటిల్స్ ఉంటాయి)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. దుకాణ యజమాని మహమ్మద్ జోహెబ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.