మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 08:06:34

నీట్ పరీక్ష వేళ.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

నీట్ పరీక్ష వేళ.. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

చెన్నై : దేశవ్యాప్తంగా ఆదివారం నీట్‌ పరీక్ష కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్నో ఆశలతో వైద్య కోర్సుల్లో చేరేందుకు పరీక్షకు సిద్ధమవుతూ ముగ్గురు విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలించారు. ఒకరు రెండో సారి.. మరొకరు మూడోసారి పరీక్షకు హాజరుకానుండగా.. ఈ సారైనా అర్హత సాధిస్తామో లేదోనని.. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయోలేదోనన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటనలు తమిళనాడు రాష్ట్రంలో శనివారం చోటు చేసుకున్నాయి. ధర్మపురికి చెందిన ఆదిత్య తల్లిదండ్రులు మణివన్నన్‌, గృహిణి జయచిత్ర దంపతులు పాత ట్రాక్టర్లను విక్రయిస్తున్నారు. వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లారు. అంతకు ముందు ఆదివారం తనయుడితో కలిసి నీట్‌ ఎగ్జామ్‌ సెంటర్‌ను సందర్శించి వచ్చారు. తల్లిదండ్రులు సాయంతం ఇంటికి వచ్చే సరికి లోపలి నుంచి తలుపు గడియ వేసి ఉంది. దీంతో కిటికీని తెరిచి చూడగా.. మృతదేహం కనిపించింది.

ఆదిత్య నమక్కల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇంటర్‌ పూర్తి చేశాడు. నీట్‌ కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నాడు. మాక్‌ టెస్టుల్లో బాగా రాణించినట్లు మృతుడి తల్లి తెలిపిందని పోలీసులు పేర్కొన్నారు. ధర్మపురి ఎస్పీ ప్రవీష్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే నమక్కల్‌లోని తిరుచెంగోడ్‌కు చెందిన 21 ఏళ్ల ఓం మోథీలాల్‌ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి ఇంతకు ముందు రెండుసార్లు ప్రయత్నం చేసినా విజయవంతం కాలేకపోయాడు. ఆదివారం పరీక్ష ఉండగా.. శనివారం రాత్రి గదిలోకి వెళ్లిన ఓం చాలా సేపటికి బయటకు రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూడగా.. విగతజీవుడై కనిపించగా కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి తండ్రి మురుగేసన్‌ ఎలక్ట్రికల్ షాపు నడుపుతుండగా.. తల్లి గోమతి గృహిణి. సోదరుడు సుభాష్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమితం తిరుచెంగోడ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. ‘నీట్‌ పరీక్షకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడా? మరేదైనా కారణమా? అనేది ధ్రువీకరించలేదు. పోలీసుల దర్యాప్తు మాత్రమే ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని నమక్కల్‌ కలెక్టర్‌ మేగ్రాజ్‌ పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదని ఎస్పీ ఎస్‌ శక్తి గణేశన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా మధురైకి చెందిన 19 ఏళ్ల ఎం దుర్గా అనే విద్యార్థిని సైతం ఆత్మహత్య చేసుకుంది. ‘నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. నేను మెడికల్ సీటు పొందకపోతే మిమ్మల్ని నిరాశపరుస్తానని భయపడుతున్నాను’ అంటూ తన చివరి మాటలను తల్లిదండ్రులకు చెప్పి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. దుర్గ రెండో సారి నీట్‌కు సిద్ధమవుతోంది. గతేడాది హాజరైనా విజయవంతం కాలేకపోయింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo