ఆదివారం 17 జనవరి 2021
Crime - Nov 13, 2020 , 20:08:06

మద్యం మత్తులో పోలీస్ వాహనం చోరీ

మద్యం మత్తులో పోలీస్ వాహనం చోరీ

మిర్యాలగూడ: మద్యం మత్తులో ఓ యువకుడు.. పోలీసుల కళ్లు గప్పి ఏకంగా సీఐ వాహనంతో పరారయ్యాడు. పోలీసులు చేజ్‌ చేసి పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన వంశీ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడలో ఉంటున్న తన సోదరి ఇంటికి గురువారం వచ్చాడు. రాత్రి సమయంలో ఈదులగూడ పెట్రోల్‌ బంకు సమీపంలో రహదారి వెంట తన స్నేహితులు సాయి, మహేశ్‌తో కలిసి మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మిర్యాలగూడ రూరల్‌ సీఐ రమేశ్‌బాబు కారు దిగి యువకుల వద్దకు వెళ్లి    ఆరా తీశారు.

రోడ్ల వెంట మద్యం సేవించరాదని హెచ్చరిస్తూ కౌన్సెలింగ్‌ చేస్తున్న సందర్భంలో వంశీ పోలీసుల కళ్లుగప్పి సీఐకి చెందిన ఇన్నోవా వాహనంలో  పరారయ్యాడు. గమనించిన సీఐ రోడ్డుపై వెళ్తున్న మరో వాహనంలో వెంబడించారు. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న రూరల్‌ ఎస్‌ఐ పరమేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆలగడప టోల్‌గేట్‌ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు ఎదురుగా వచ్చిన వాహనాన్ని ఢీకొట్టడంతో సీఐ వాహనం ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సదా నాగరాజు తెలిపారు.