నా వయసు 26 ఏండ్లు. పెండ్లయి 2 సంవత్సరాలు అవుతున్నది. పెండ్లి తర్వాత నాకు థైరాయిడ్ సమస్య మొదలైంది. అప్పటి నుంచీ కలయికపై అస్సలు ఆసక్తి ఉండటం లేదు. ‘నాతో ఒక్కసారి కూడా ప్రేమగా ఉండవు’ అంటూ మా ఆయన చాలా బాధపడుతున్నాడు. కలయిక పట్ల నాకు ఎందుకు ఆసక్తి కలగటం లేదు. మావారితో సరదాగా ఎలా ఉండాలో కూడా పాలుపోవటం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు?
– ఓ సోదరి, మెయిల్ ద్వారా
థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లు శరీరంలోని అన్ని కణాలు, అన్ని భాగాలతో పాటు లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన అవయవాల పనితీరునూ ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ సమస్య హైపో, హైపర్ థైరాయిడిజం రూపాలతో ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లలో 31 శాతం మంది పురుషులు అంగస్తంభన లోపంతో సతమతం అవుతున్నారు. థైరాయిడ్ బాధిత స్త్రీలలో 43 శాతం మంది సెక్స్‌పై నిరాసక్తత, కలయికలో నొప్పి తదితర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, థైరాయిడ్ వల్ల వచ్చే ఇతర శారీరక అనారోగ్యాలు, నీరసం, ఉద్రేకం, కోపం, చిరాకు, దుఃఖం, డిప్రెషన్, ఒత్తిడి లాంటి మానసిక లక్షణాలు సెక్స్‌పై విముఖతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తే ప్రమాదం ఉంది. మీరు ఎండో క్రెయినాలజిస్ట్ను కలిసి థైరాయిడ్ ప్రొఫైల్ మరోసారి చేయించుకోండి. లీవో థైరాక్సిన్ హార్మోన్ సరైన స్థాయిలో తీసుకోవాలి. దీనివల్ల దాంపత్య జీవితం పట్ల మళ్లీ ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే, కలయిక తరువాత నొప్పి తగ్గడానికి వ్జైనా లోపలి కండరాలకు లూబ్రికెంట్ ఐప్లె చేయాలి. థైరాయిడ్ సమస్య వల్ల వచ్చే ఊబకాయం, తలనొప్పి, కండ్ల కింద నలుపు, డ్రై స్కిన్, పాలీ సిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, హార్మోన్ల అసమతౌల్యం, రుతుక్రమంలో సమస్యలు.. మొదలైన వాటిని వాకింగ్, యోగా, ప్రాణాయామం ద్వారా కొంతమేర నియంత్రించుకోవచ్చు. నిత్యం పౌష్ఠికాహారం తీసుకోవాలి. డిప్రెషన్, స్ట్రెస్ తగ్గడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రయత్నించండి. వీటితో పాటు సమస్యను అధిగమించడానికి దంపతులిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. సమస్యను శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. ఇద్దరూ ఓసారి మారిటల్ థెరపిస్టును కలిస్తే ప్రయోజనం ఉంటుంది.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్, హస్తినాపురం,
హైదరాబాద్. ఫోన్: 9849770409
ఈ మెయిల్: bharathid506@gmail.comRELATED NEWS