ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 19:04:25

కరోనా రోగిపట్ల డాక్టర్‌ అసభ్య ప్రవర్తన..కేసు నమోదు

కరోనా రోగిపట్ల డాక్టర్‌ అసభ్య ప్రవర్తన..కేసు నమోదు

బెంగళూరు: కరోనా విజృంభణ ప్రారంభమైనప్పటినుంచీ వైద్యులు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా సేవలందిస్తూ అందరి ప్రశంసలూ పొందుతున్నారు. కానీ, బెంగళూరులో ఇందుకు భిన్నంగా ఓ డాక్టర్‌ కొవిడ్‌ రోగిని వేధించి, అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 

కర్ణాటక రాజధాని బెంగళూరులోని విక్టోరియా దవాఖాన వైద్యుడు కొవిడ్‌-19 సోకిన మహిళా రోగిని వేధించాడు. ఈ సంఘటన జూలై 25న రాత్రి దవాఖానలోని ట్రామా కేర్ సెంటర్‌లో జరిగింది. ఆ రోజు రాత్రి వైద్యుడు తనను అనుచితంగా తాకినట్లు మహిళ ఆరోపించింది. కొవిడ్ వార్డులోని నోడల్ అధికారికి సదరు మహిళ విషయాన్ని చెప్పింది. అనంతరం కొవిడ్‌ వార్డు ఇన్‌ఛార్జి  డాక్టర్ అసిమా బాను సీనియర్ దవాఖాన అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు గుర్తు తెలియని వైద్యుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు. ఈ సంఘటన, నిందితుడైన డాక్టర్ గురించి దవాఖాన అధికారులు ఇంకా తగిన వివరాలు ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. ఆరోపణలపై విచారణ కోసం కమిటీ వేశామనీ, కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత పోలీసులకు వివరాలు తెలియజేస్తామని విక్టోరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కృష్ణ వెల్లడించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo