మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 19:51:36

బాలుడి ప్రాణాల్ని బ‌లిగొన్న ఈత నేర్చుకోవాల‌నే కోరిక‌

బాలుడి ప్రాణాల్ని బ‌లిగొన్న ఈత నేర్చుకోవాల‌నే కోరిక‌

న‌ల్ల‌గొండ : ఈత నేర్చుకోవాల‌నే బ‌ల‌మైన కోరిక‌ ఓ బాలుడి ప్రాణాల్ని బ‌లిగొంది. ఈ విషాద సంఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లా నిడ‌మ‌నూరు మండ‌లం ముప్పారం గ్రామంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లం నితిన్(12) అనే బాలుడు ఈత నేర్చుకోవాల‌నుకున్నాడు. నాగార్జున‌సాగ‌ర్ ఎడ‌మ‌కాల్వ‌కు నీటి విడుద‌ల ప్రారంభం నుంచి ఈత నేర్చుకునేందుకు త‌ల్లిదండ్రుల అనుమ‌తి అడుగుతున్నాడు. కాల్వ ప్ర‌మాద‌స్థాయిలో ప్ర‌వ‌హిస్తుండ‌టంతో త‌ల్లిదండ్రులు ఎప్ప‌టిక‌ప్పుడూ వారిస్తున్నారు. నేడు కూడా ఇంట్లో తండ్రి లేని స‌మ‌యంలో ఈత నేర్చుకునేందుకు వెళ్తాన‌ని త‌ల్లితో చెప్పాడు.

ఆమె వ‌ద్ద‌ని పేర్కొన్న‌ప్ప‌టికీ ఎలాగోలా మేనేజ్ చేసి అక్క‌డినుంచి జారుకుని ఈత నేర్చుకునేందుకు పెద్ద‌కాల్వ‌కు వెళ్లాడు. మ‌ధ్యాహ్నం అయినా ఎంత‌కి కొడుకు తిరిగి రాక‌పోవ‌డంతో వెత‌క‌డం ప్రారంభించారు. సైకిల్‌పై కాల్వ‌వైపు వెళ్తుండ‌గా చూసిన‌ట్లు ప‌లువురు చెప్పారు. దీంతో వెళ్లి వెత‌క‌గా సైకిల్‌, విద్యార్థి బ‌ట్ట‌లు కాల్వ గ‌ట్టుపై క‌నిపించాయి. కాగా బాలుడు అగుపించ‌లేదు. వెత‌క‌గా వెత‌క‌గా కాసేప‌టికి బాలుడి మృత‌దేహం క‌నిపించింది. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. నిడ‌మ‌నూరు పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేశారు. 


logo