బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 20:29:46

ఢిల్లీ అల్లర్ల కేసులో 15 మందిపై 17 వేల పేజీల చార్జిషీట్

ఢిల్లీ అల్లర్ల కేసులో 15 మందిపై 17 వేల పేజీల చార్జిషీట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని అట్టుడుకికేలా చేసిన అల్లర్ల కేసులో 15 మంది నిందితులపై స్పెషల్ సెల్ పోలీసులు బుధవారం చార్జిషీట్‌ను దాఖలు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని పలు సెక్షన్ల కింద 15 మంది నిందితులపై మోపిన అభియోగలతో కూడిన 17 వేల పేజీల చార్జిషీట్‌ను స్టీల్ బాక్స్‌లో భద్రపరిచి కర్కార్దూమా కోర్టులో దాఖలు చేశారు. అయితే ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌ను ఇటీవలే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి పేర్లు ఈ చార్జిషీట్‌లో లేవని స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. తర్వాత దాఖలు చేసే అనుబంధ చార్జిషీట్ లో వారి పేర్లు ఉంటాయని చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేయగా వీరిలో 15 మందికి సంబంధించి లభించిన ఆధారాలు, దర్యాప్తు ఆధారంగా బుధవారం చార్జిషీట్ ను దాఖలు చేశారు. ఈ 15 మందిలో నటాషా నార్వాల్, దేవంగన కలిత, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా, ఇష్రత్ జహాన్, మీరన్ హైదర్, సఫూరా జర్గర్, ఖలీఫ్ సైఫీ పేర్లు ఉన్నాయి. మరో ఆరుగురికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు లభించిన తర్వాత వారి పేర్లతో అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేనున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo