శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 20, 2020 , 18:29:04

విదేశీయులను మోసం చేస్తున్న 42 మంది అరెస్ట్‌

విదేశీయులను మోసం చేస్తున్న 42 మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ: అధికారుల పేరుతో విదేశీయులను మోసం చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న 42 మందిని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. పీరగార్హి ప్రాంతంలోని నకిలీ కాల్‌ సెంటర్‌పై సైబర్‌ సెల్‌ పోలీసులు రైడ్‌ చేశారు. 90కి పైగా డిజిటల్‌ పరికరాలు, రూ.4.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో పని చేస్తున్న 42 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 26 మంది పురుషులు కాగా 16 మంది మహిళలు. వీరికి నెలకు రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. తద్వారా ఈ నకిలీ కాల్‌ సెంటర్‌ ద్వారా పెద్ద ఎత్తున దందా నిర్వహిస్తున్నారు. 

అమెరికాతోపాటు ఇతర దేశాల పౌరులను వీరు లక్ష్యంగా చేసుకుంటారు. సంబంధిత దేశాలకు చెందిన సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ మార్షల్స్ విభాగం అధికారుల పేరుతో ఫోన్లు చేస్తారు. నేరం జరిగిన ప్రాంతలో మీ బ్యాంకు ఖాతా గురించి తెలిసిందని, లేదా డ్రగ్స్‌ దందా వ్యవహారంలో ఈ ప్రమేయం ఉన్నట్లు తెలిసిందని బెదిరిస్తారు. చట్టపరంగా ఎలాంటి చర్యలు లేదా అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తారు. గిఫ్ట్‌ కార్డులు, బిట్‌కాయిన్‌ విధానంలో డబ్బులు బదిలీ చేయాలని బాధితులను కోరతారని సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అన్యేష్ రాయ్ తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo