శనివారం 16 జనవరి 2021
Crime - Oct 05, 2020 , 16:24:55

ఫోన్‌ దొంగ‌ను ప‌ట్టుకుంటే పొడిచి చంపిన మ‌రో దొంగ‌!

ఫోన్‌ దొంగ‌ను ప‌ట్టుకుంటే పొడిచి చంపిన మ‌రో దొంగ‌!

న్యూడిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. త‌న ఫోన్ దొంగిలించ‌బోయిన దొంగ‌ను ప‌ట్టుకోవ‌డంతో మ‌రో దొంగ అత‌డిని క‌త్తితో పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి సెంట్ర‌ల్ ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఈ దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అమ‌న్ (24) ఆదివారం రాత్రి త‌న మిత్రులు అనిరుధ్‌, హ‌రి ఓమ్‌, రాజుల‌తో క‌లిసి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. అదే స‌మ‌యంలో ఇద్ద‌రు దొంగ‌లు బైకుపై వ‌చ్చి అమ‌న్ ఫోన్ లాక్కునేందుకు ప్ర‌యత్నించారు. 

దాంతో అప్ర‌మ‌త్త‌మైన అమ‌న్ ఆ దొంగ‌ను బైక్‌పై నుంచి కింద‌కు లాగి బిగ్గ‌ర‌గా ప‌ట్టుకున్నాడు. వెంట‌నే బైకు దిగి వ‌చ్చిన మ‌రో దొంగ క‌త్తితో అమ‌న్‌ను విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. అమ‌న్ స్నేహితులు అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా వారిపై కూడా క‌త్తితో దాడి చేస్తూ దొంగ‌లు పారిపోయారు. అయితే, దొంగ‌ల దాడిలో అనిరుధ్‌కు కూడా క‌త్తి గాయాలయ్యాయి. వెంట‌నే రామ్ మ‌నోహ‌ర్ లోహియా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అమ‌న్ అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. 

తీవ్రంగా గాయ‌ప‌డ్డ అనిరుధ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆర్ఎంఎల్ ఆస్పత్రి యాజ‌మాన్యం ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఆస్ప‌త్రికి చేరుకుని బాధితుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అమ‌న్ మ‌రో ఇద్ద‌రు స్నేహితులైన హ‌రి ఓం, రాజుల‌ను ఘ‌ట‌నా ప్రాంతానికి తీసుకెళ్లి నేరం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. కేసు న‌మోదు చేసి నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.  ‌    ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.