సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 31, 2020 , 21:23:45

న్యూఇయర్‌ వేడుక కోసం.. దోపిడీ నాటకం

న్యూఇయర్‌ వేడుక కోసం.. దోపిడీ నాటకం

న్యూఢిల్లీ: న్యూఇయర్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి దోపిడీ నాటకం ఆడాడు. చివరకు పోలీసుల దర్యాప్తులో వారిద్దరు పట్టుబడ్డారు. ఢిల్లీలోని జామియా నగర్‌కు చెందిన ఫైజ్ అహ్మద్ సిద్దిఖీ (22), మహ్మద్ సాదిక్ (21) స్నేహితులు. వారిద్దరు కొత్త సంవత్సరాన్ని సిమ్లాలో జరుపుకోవాలని భావించారు. దీనికి డబ్బుల కోసం దోపిడీ డ్రామాకు తెరతీశారు. సిద్దిఖీ, తన సోదరుడు గుల్జార్‌తో కలిసి పాలు సరఫరా చేస్తుంటాడు. బుధవారం పాలు అమ్మగా వచ్చిన రూ.1.36 లక్షలను కొందరు కత్తితో బెదిరించి దోచుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో తన సోదరుడు టాయిలెట్‌ కోసం వెళ్లినట్లు సిద్దిఖీ చెప్పాడు. పాల యజమాని నౌషాద్‌కు ఈ విషయం తెలిపాడు. 

కాగా పోలీసులు సిద్దిఖీ, గుల్జార్‌ను విడివిడిగా ప్రశ్నించారు. తన సోదరుడి మొబైల్‌కు ఎస్‌ పేరుతో పలుసార్లు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు గుల్జార్‌ తెలిపాడు. దీంతో కాల్‌ డేటాను పోలీసులు పరిశీలించగా ఆ నంబర్‌ సాదిక్‌గా తేలింది. ఆ సమయంలో అతడు అక్కడికి వచ్చినట్లు తెలిసింది. దీంతో సాదిక్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు. రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ దోపిడీకి ప్లాన్‌ వేసిన సిద్దిఖీని కూడా అరెస్ట్‌ చేయడంతోపాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo