బుధవారం 24 ఫిబ్రవరి 2021
Crime - Jan 15, 2021 , 19:54:14

బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి

బాలుడికి లింగ మార్పిడి చేసి.. మూడేండ్లుగా లైంగికదాడి

న్యూఢిల్లీ: ఒక బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించిన నలుగురు మూడు ఏండ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం వెలుగుచూసింది. 13 ఏండ్ల బాలుడికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. మూడేండ్ల కిందట లక్మీనగర్‌లో జరిగిన డ్యాన్స్‌ కార్యక్రమంలో పరిచయమైన ఒక వ్యక్తి, శిక్షణ ఇస్తానని చెప్పి ఆ బాలుడ్ని తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడితో కొన్ని డ్యాన్స్‌ కార్యక్రమాలు ఇప్పించి డబ్బులు సంపాదించాడు. అయితే తన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసి జీవిస్తానని ఆ బాలుడు ఒక రోజు అతడితో చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలుడ్ని నిర్బంధించి కొన్ని రోజులు మత్తుపదార్థాలు ఇచ్చాడు. అనంతరం బలవంతంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించాడు. హార్మోన్‌ ఇంజక్షన్లు కూడా ఇవ్వడంతో ఆ బాలుడి శరీరంలో మార్పులు సంభవించాయి. 

అనంతరం ఆ వ్యక్తి , ముగ్గురు స్నేహితులు కలిసి కొన్ని ఏండ్లుగా బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొందరు విటుల వద్దకు కూడా పంపారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద యాచించాలని డిమాండ్‌ చేశారు. ఆ వ్యక్తి కూడా మహిళల దుస్తులు ధరించి రోడ్డుపై కనిపించే వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత బాధిత బాలుడికి తెలిసిన మరో బాలుడ్ని ఆ వ్యక్తి తీసుకొచ్చాడు. 

కాగా, గత ఏడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వీరిద్దరు పారిపోయారు. బాధిత బాలుడు తన తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి కుటుంబంతో కలిసి ఇద్దరు ఉండసాగాడు. అయితే డిసెంబర్‌లో బాలుడి అడ్రస్‌ కనిపెట్టిన ఆ వ్యక్తి ఇంటికి వచ్చాడు. తల్లిని తుపాకీతో బెదిరించి కొంత డబ్బులు దోచుకున్నాడు. ఇద్దరు బాలురను తన వెంట తీసుకుపోయాడు. 

రెండు రోజుల అనంతరం ఆ ఇద్దరు బాలురు అతడి చెర నుంచి తప్పించుకుని పారిపోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లి దాక్కున్నారు. మరునాడు ఒక న్యాయవాది వారిని గమనించి ఆరా తీయగా జరిగిన దారుణాన్ని చెప్పారు. దీంతో ఆ న్యాయవాది వారిద్దరిని ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)కు అప్పగించారు. 

స్పందించిన ఆ సంస్థ పిల్లలపై లైంగిక దాడి చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇద్దరు నిందితులు అరెస్ట్‌ కాగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ బాలురను సంరక్షణ కేంద్రానికి తరలించిన డీసీడబ్ల్యూ వారికి అన్ని విధాలా రక్షణగా ఉంటామని భరోసా ఇచ్చింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo