మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 20:28:08

ప్రేమ.. కిడ్నాప్‌ నాటకం.. రూ. కోటి డిమాండ్‌.. డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

ప్రేమ.. కిడ్నాప్‌ నాటకం.. రూ. కోటి డిమాండ్‌.. డామిట్‌ కథ అడ్డం తిరిగింది!

ఆగ్రా: ప్రేమలో పడిన ఓ యువతి కిడ్నాప్‌ డ్రామా ఆడి తన తండ్రి దగ్గరనుంచే రూ. కోటి కొట్టేయాలని నాటకమాడింది. పోలీసుల విచారణలో ఇదంతా నాటకమని తేలడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలోని నాగ్లా భజ్నా గ్రామంలో జరిగింది. 

నాగ్లా భజ్నా గ్రామానికి చెందిన  19 ఏళ్ల యువతి, పొరుగింట్లో ఉన్న యువకుడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా వారి ప్రేమాయణం సాగుతున్నది. అయితే, ఇది ఇంట్లో తెలియగా, వద్దని వారించారు. దీంతో సదరు యువతి ప్రియుడితో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడింది. గురువారం నుంచి కనిపించకుండాపోయింది. తన తల్లిదండ్రులకు వేరే నంబర్‌నుంచి ఫోన్‌ చేసి, గొంతుమార్చి మాట్లాడింది. మీ బిడ్డను కిడ్నాప్‌ చేశాను. వదిలేయాలంటే రూ. కోటి ఇవ్వాలని బెదిరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇందులో ఫ్రొఫెషనల్‌ కిడ్నాపర్ల హస్తముందని భావించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. అమ్మాయి కోసం  అన్వేషణ ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో అనుమానం వచ్చిన పోలీసులు సదరు యువతి ఫోన్‌నే ట్రేస్‌ చేశారు. ఆమె ఇంటి నుంచి కొంతదూరంలోనే ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి వారిద్దరినీ అరెస్ట్‌ చేశారు. తండ్రి ఓ స్కూల్‌ పెట్టేందుకు రూ. కోటి పెట్టుబడి పెడుతున్నారని తెలుసుకుని, ఆ డబ్బులతో పారిపోవాలని యువతి నిశ్చయించుకుందని, ఇందులో భాగంగానే కిడ్నాప్‌ డ్రామా ఆడిందని పోలీసులు తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo