e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home Top Slides 12 మందికి ఉరిశిక్ష

12 మందికి ఉరిశిక్ష

12 మందికి ఉరిశిక్ష
  • మున్నా గ్యాంగ్‌ దారుణాలపై ఒంగోలు కోర్టు సంచలన తీర్పు
  • ఇద్దరిని రెండుసార్లు ఉరితీయాలి
  • మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారం
  • హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్ల హత్య కేసుల్లో ఒంగోలు కోర్టు తీర్పు

హైదరాబాద్‌, మే 24 (నమస్తే తెలంగాణ): హైవేపై వెళ్లే లారీలను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్లు, క్లీనర్లను హత్యచేసి దోపిడీకి పాల్పడిన కేసుల్లో ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నాతోపాటు, మరో 11 మందికి ఉరిశిక్ష విధించింది. వీరిలో ఇద్దరిని రెండుసార్లు ఉరితీయాలని పేర్కొన్నది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. మున్నా గ్యాంగ్‌పై 2008లో 7 కేసుల్లో 13 మందిని హత్యచేసినట్టు అభియోగాలు ఉండగా.. మూడు కేసుల్లో సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఒంగోలుకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ సమద్‌.. ఎస్‌కే రియాజ్‌, సయ్యద్‌ హిదయతుల్లా, మహ్మద్‌ జమాలుద్దీన్‌, బటాలా సాల్మన్‌, వై చిన్న వీరస్వామి, జీ భానుప్రకాశ్‌, రాచమల్ల సంపత్‌, జీ శ్రీధర్‌, ఎస్‌కే హఫీజ్‌, ఏ గంగాధర్‌రావు, ఎస్‌కే కమాల్‌ సాహెబ్‌, ఎస్‌కే రహ్మతుల్లా, ఎస్‌కే దాదాపీర్‌, ఎస్‌కే ఇర్ఫాన్‌, ఎస్‌కే రఫీతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటుచేశారు. మున్నా గ్యాంగ్‌గా పిలిచే వీరంతా చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై ఒంగోలు సమీపంలో ఐరన్‌ లోడ్‌తో వెళుతున్న ఇతర రాష్ర్టాల లారీలను ఆపి వాటి డ్రైవర్లు, క్లీనర్లను హత్యచేసేవారు. మృతదేహాలను నది, వాగు ఒడ్డున పూడ్చిపెట్టి, సరుకును అమ్ముకొనేవారు. లారీలను తుక్కుగా మార్చి పాత ఇనుప సామాన్లకు అమ్మి సొమ్ముచేసుకునేవారు. పశ్చిమబెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి 21.7 టన్నుల ఇనుపరాడ్లతో తమిళనాడు కల్పక్కం బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్‌, క్లీనర్‌ అదృశ్యమయ్యారని 2008 అక్టోబర్‌ 17న యజమాని కుప్పుస్వామి ఒంగోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివే మరికొన్ని కేసులు రావటంతో పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై దృష్టి పెట్టారు. మున్నాగ్యాంగ్‌ ఈ దారుణాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. 20కిపైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని మాజీఎమ్మెల్యే ఫాంహౌజ్‌లో అరెస్టు చేసి ఒంగోలుకు తీసుకొచ్చారు.


ఇతర రాష్ర్టాల లారీలే టార్గెట్‌
మున్నా గ్యాంగ్‌ పోలీసు వేషాల్లో ఉంటూ చెన్నై- కోల్‌కతా జాతీయరహదారిపై వెళుతున్న లారీలను తనిఖీల పేరుతో ఆపేవారు. ఇతర రాష్ర్టాల లారీలనే టార్గెట్‌ చేసేవారు. లారీలను నిలిపిన డ్రైవర్లు, క్లీనర్ల గొంతులకు తాడు బిగించి చంపేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మొత్తం ఏడు కేసుల్లో మూడింట్లో కోర్టు తీర్పు చెప్పగా.. మరో నాలుగు కేసుల తీర్పు వెలవడాల్సి ఉన్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
12 మందికి ఉరిశిక్ష

ట్రెండింగ్‌

Advertisement