భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలి దాడి

హైదరాబాద్ : ఓ కోడలు తన అత్త పట్ల క్రూరంగా ప్రవర్తించింది. భర్తతో మాట్లాడనివ్వట్లేదని అత్తపై కోడలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన నగరంలోని మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్లో చోటు చేసుకుంది. భర్త ఉబిద్ అలీఖాన్ కొన్నాళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. దీంతో అతని తల్లి, భార్యాపిల్లలు కలిసి ఫిరోజ్ గాంధీ నగర్లో నివాసముంటున్నారు. గత కొంతకాలం నుంచి సౌదీలో ఉంటున్న భర్తతో ఫోన్ మాట్లాడనివ్వడం లేదని, పోషణ గురించి పట్టించుకోవడం లేదనే అక్కసుతో అత్తపై కోడలు దాడి చేసింది. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై అత్తను కోడలు కొట్టింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హుమాయన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.