బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 22, 2020 , 15:30:06

రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు అరెస్టు

రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు అరెస్టు

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. కేసు వివరాలను సీపీ సజ్జనార్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఆనియన్‌ క్రెడిట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, సీఎస్‌ ఫాక్స్‌ టెక్నాలజీ అనే రెండు కంపెనీలు గూగూల్‌ ప్లే స్టోర్‌ ద్వారా రుణ యాప్‌లను అందిస్తూ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకే రుణాలు అంటూ వినియోగదారులను మోసం చేస్తున్నాయన్నారు.

రాయదుర్గంలో భవనం అద్దెకు తీసుకుని రెండు కంపెనీలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు కంపెనీల్లో 110 మంది సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 35 శాతం వడ్డీలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలకు చెందిన రూ.1.52 కోట్లు నిల్వ ఉన్న 18 బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో శరత్‌ చంద్ర ప్రధాన నిందితుడు అన్నారు.  

నిందితుల వద్ద నుంచి 22 సెల్‌ఫోన్లు, 3 కంప్యూటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ చెప్పారు. ఆన్‌లైన్‌ రుణ యాప్‌లను డౌన్‌లోన్‌ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఈ యాప్‌ల భారిన పడి వేధింపులకు గురైతే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. అక్రమ మనీ లెండర్స్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు సజ్జనార్‌ హెచ్చరించారు. నగర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి యాప్‌లపై రైడ్‌లు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


logo