సోమవారం 06 జూలై 2020
Crime - Jun 02, 2020 , 21:25:55

సైబర్‌ గాలం.. లక్షల్లో మాయం

సైబర్‌ గాలం.. లక్షల్లో మాయం

హైదరాబాద్‌: సైబర్‌ మోసగాళ్లు ఫోన్‌ చేస్తూనే ఉన్నారు.. అమాయక ప్రజానీకం మోసపోతూనే ఉన్నారు.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.. ఇది సైకిల్‌ మాదిరిగా కొనసాగుతున్నదే కానీ ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. కొత్తకొత్త మోసాలతో నైజీరియన్‌ సైబర్‌ చీటర్లు వస్తున్నారని పోలీసులు ఎంత మొత్తుకొంటున్నా చెవికెక్కించుకొనేవారే కరువయ్యారు. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట వారి చేతిలో మోసపోతూ లక్షల్లో పంగనామాలు పెట్టించుకొంటున్నారు.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు.. కరోనా కిట్స్‌తో పాటు 30 వేల పౌండ్లు పంపిస్తున్నానంటూ నమ్మించి నగర వాసికి రూ. 1.07 లక్షల మేర టోకరా వేశాడు. మూసారాంబాగ్‌కు చెందిన జానీకి ఫేస్‌బుక్‌లో డామ్నిక్స్‌ స్మి త్‌ అనే వ్యక్తి పేరుతో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. లండన్‌లో ఫాస్టర్‌గా పనిచేస్తున్నానంటూ కొన్నాళ్లు చాటింగ్‌ చేశాడు. 380 కిలోల బరువైన కరోనా కిట్లు, వాటితోపాటు 30 వేల పౌండ్లు పంపిస్తున్నానంటూ నమ్మించాడు.

మరుసటిరోజు ఢిల్లీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ విభాగం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఆగంతకుడు.. మీకొచ్చిన పార్సల్‌ను కస్టమ్స్‌ క్లియెరెన్స్‌ చేసుకోవాలంటూ మూడు దఫాలుగా రూ. 1.07 లక్షలు వసూలు చేశారు. మరింత డబ్బు అడగడంతో అనుమానం వచ్చి సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అదేవిధంగా నగరానికి చెందిన సిద్దార్దకు నో బ్రోకర్స్‌ టెక్నీలజీ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. యాక్సెస్‌ బ్యాంకు సర్వీస్‌ ఇస్తామని, క్రెడిట్‌ కార్డు వివరాలు చెప్పాలంటూ చివరి నాలుగు అంకెలు తెలుసుకొని, అతడిని మాటల్లో పెట్టి రూ. 1.17 లక్షలు కార్డుతో డ్రా చేశారు. 

జీడిమెట్లకు చెందిన కే సుచరిత లక్ష రుపాయాల రుణం పొందేందుకు గూగుల్‌లో వెదికింది. మని బజార్‌ వెబ్‌సైట్‌లో పర్సనల్‌ లోన్‌ కోసం గాలించి.. తనకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసింది.

గతనెల 28 న మనీ బజార్‌ నుంచి సోమ్‌నాథ్‌ మాట్లాడుతున్నానని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తి.. రుణం పొందేందుకు అర్హత పొందారని చెప్పి.. లక్ష రుణం కోసం రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.3,500, మొదటి ఈఎమ్‌ఐగా రూ.4,432, జీఎస్టీ ఫీజుగా రూ.6,500, సిటీ ట్రాన్స్‌ఫర్‌ కోసం రూ.12,600, ఆర్‌టీజీఎస్‌ చార్జీలుగా రూ.18,900, ఇంకమ్‌ట్యాక్స్‌ చార్జీలుగా రూ.25,200, రుణం ఇన్సూరెన్స్‌ కింద రూ.3,500.. ఇలా మొత్తం రూ.81,882 మేర వసూలు చేశాడు. రుణం ఇంకా రాలేదని అడిగితే రూ.37 వేలు చెల్లిస్తే వచ్చేస్తుందని నమ్మించే ప్రయత్నం చేయడంతో.. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అదేవిధంగా, మియాపూర్‌ ప్రాంతానికి చెందిన శ్రీకాంత్‌ను లక్కీ లాటరీ గెల్చుకొన్నారని నమ్మించి.. రూ.1.25 లక్షలు సైబర్‌ మోసగాళ్లు లాక్కొన్నారు. ఫ్రాంచైజ్‌ ఇస్తామంటూ కూకట్‌పల్లికి చెందిన మంద కుమారస్వామిని రూ.2.30 లక్షల మేర మోసం చేశారు. ఇలాంటి సైబర్‌ మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.


logo