ఆదివారం 12 జూలై 2020
Crime - Jun 01, 2020 , 21:55:06

సాయం చేయమంటూ ఒకరికి.. సాయం చేసినందుకు మరొకరికి మోసం

సాయం చేయమంటూ ఒకరికి.. సాయం చేసినందుకు మరొకరికి మోసం

హైదరాబాద్‌: ఈ-మెయిల్‌ ద్వారా పరిచయమైన గుర్తుతెలియని వ్యక్తులు ప్రజలకు సాయంగా భారీగా డాలర్లు పంపిస్తున్నామని, వాటిని పేదలకు పంచమంటూ నమ్మించి ఏకంగా రూ. 2.3 లక్షలు టోకరా వేశారు. పుట్టపర్తికి చెందిన వెంకట్‌ సుధాకర్‌ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత లాక్‌డౌన్‌ విధించడంతో సొంతూరికి వెళ్లలేక హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో తెలిసిన వారి వద్ద కొన్నాళ్లు ఉన్నాడు. ఈ సమయంలో అతడికి జాన్‌గతిన్‌ అనే ఒక వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చింది. తాను డాలర్లు పంపిస్తానని, వాటిని తీసుకొని పేదలకు పంపిణీ చేయాలంటూ పేర్కొన్నాడు. సరేనంటూ తన అంగీకారం తెలుపడంతో.. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. సమయం కోసం వేచిచూసిన మోసగాడు 45 వేల డాలర్లు పంపిస్తున్నానంటూ వెంకట్‌ సుధాకర్‌ను నమ్మించాడు. మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేసి, మీ పేరుపై భారీగా డాలర్లు వచ్చాయి.. క్లియెరెన్స్‌ చేసుకోవాలంటూ నమ్మించి రూ. 2.3 లక్షలు దఫ దఫాలుగా అతడి నుంచి లాగేశారు. అనంతరం ఫోన్లు మూగబోవడంతో మోసపోయానని తెలుసుకొన్న వెంకట్‌.. సోమవారం సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరోకేసులో.. చిలకలగూడకు చెందిన నరేశ్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు పనిచేసే సంస్థ వద్ద ఉండే సెక్యూరిటీ గార్డుకు సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. హిందీలో మాట్లాడుతూ పేటీఎం కేవైసీని అప్‌డేట్‌ చేసుకోమంటూ సూచించారు. తనకు హిందీ అర్ధం కాకపోవడంతో మాట్లాడాలంటూ సదరు సెక్యూరిటీ గార్డు తన ఫోన్‌ను నరేశ్‌కు ఇచ్చాడు. నరేశ్‌ను మాటల్లోకి దింపిన సైబర్‌ మోసగాళ్లు.. బ్యాంకు కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలంటూ నమ్మించారు. అప్‌డేట్‌ చేసేందుకు బ్యాంకు కార్డు వివరాలు సరిపోతాయి.. మళ్లీ ఫోన్‌ చేయడం కుదురుతుందో లేదో.. మీ వద్ద ఉన్న కార్డు వివరాలు చెప్పండి.. అంటూ సూచించారు. వాళ్ల మాటలను నమ్మిన నరేశ్‌ తన డెబిట్‌ కార్డు వివరాలన్నీ చెప్పేశాడు. వెంటనే అతడి బ్యాంకు ఖాతా నుంచి లక్ష రూపాయలు సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. లబోదిబోమంటూ నరేశ్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు.


logo