బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 14:54:17

ఆరుగురు స్మగర్లు అరెస్ట్‌ : రూ.1.79 కోట్లు బంగారం, సిగరెట్లు స్వాధీనం

ఆరుగురు స్మగర్లు అరెస్ట్‌ : రూ.1.79 కోట్లు బంగారం, సిగరెట్లు స్వాధీనం

న్యూఢిల్లీ: విదేశాల నుంచి అక్రమంగా బంగారం, సిగరెట్లు, గడియారాలు రవాణాచేస్తున్న ఆరుగురు స్మగర్లను కస్టమ్స్‌ అధికారులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.79 కోట్ల విలువైన బంగారం, సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. శరీరంలో బంగారాన్ని చొప్పించి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయాణికుల రూపంలో వస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు జరిపారు. ఆరుగురు వ్యక్తులు బంగారం, సిగరెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

దుబాయ్ నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ  చేయగా.. వారి వద్ద ఎస్సే లైట్ / గోల్డ్ స్పెషల్, పైన్, డన్హిల్ స్విచ్, గోల్డ్ ఫ్లేక్, బెన్సన్ & హెడ్జెస్ బ్లూ గోల్డ్ వంటి వివిధ బ్రాండ్ల విదేశీ సిగరెట్లు లభించాయి. వీటి విలువ రూ.7.52 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మరో ప్రయాణికుడి నుంచి రూ.64 లక్షల విలువైన 1.26 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పురీషనాళంతో పాటు ఇతర శరీర భాగాల్లో బంగారం దాచి తీసుకువచ్చినట్లు గుర్తించారు. కస్టమ్స్ చట్టం, 1962 నిబంధనల ప్రకారం బంగారం, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రయాణికుడి వద్ద సుమారు రూ.18 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు లభించాయి. ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. గత నెల చివర్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొమ్మిది మంది ఆఫ్ఘనిస్తాన్ పురుషుల నుంచి రూ.1.24 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

రైల్వే స్టేషన్‌లో..

గత నెలలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 37 ఏండ్ల వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా.. ఆ వ్యక్తి జాకెట్ లోపల పర్సుల్లో దాచి 6.29 కిలోల బంగారు కడ్డీలను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ప్రవీణ్ కుమార్ అంబలాల్ ఖండేల్వాల్ అని గుర్తించిన సదరు వ్యక్తి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ బృందం గమనించి తనిఖీ చేసింది. అతని జాకెట్‌లో రూ.3.25 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దాచినట్లు గుర్తించి కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo