రబ్బర్ ఎరేజర్లలో బంగారం!

ముంబై: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నా.. స్మగ్లర్ల ఆగడాలకు మాత్రం బ్రేక్ పడటంలేదు. మహమ్మద్ ఘోరీలా మళ్లీమళ్లీ వారి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అక్కడి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి పుణెకు చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు అతడిని తనిఖీ చేశారు.
అతని బ్యాగ్ హ్యాండిల్లో బంగారం ఉన్నట్లు గుర్తించి వెలికి తీయగా రెండు రబ్బర్ ఎరేజర్లు బయటపడ్డాయి. ఆ ఎరేజర్లను చీల్చి చూడగా అందులో 151.82 గ్రాముల బంగారం దొరికింది. అందులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న రెండు బంగారం బిళ్లలు, ఒక రింగు లభ్యమయ్యాయి. వాటి విలువ సుమారుగా రూ.7.89 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆ బంగారాన్ని సీజ్ చేసి, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.