శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 02:42:17

ఆట మొదలైంది..

ఆట మొదలైంది..

  • ఇంగ్లండ్‌లో క్రికెట్‌  పునఃప్రారంభం 
  • స్టోక్స్‌, బట్లర్‌ జట్ల మధ్య వామప్‌ మ్యాచ్‌ 

సౌతాంప్టన్‌: ఎన్నాళ్లకెన్నాళ్లకు! కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్‌ ఎట్టకేలకు మొదలైంది. వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ కోసం సిద్ధమయ్యేందుకు ఇంగ్లండ్‌ జట్టు రెండు టీమ్‌లుగా విడిపోయి వామప్‌ మ్యాచ్‌ ఆడింది. సౌతాంప్టన్‌ వేదికగా మొదలైన ఈ మ్యాచ్‌ వినూత్నంగా జరిగింది. ఆటగాళ్లు కచ్చితమైన నిబంధనలు పాటిస్తూ సరికొత్త అనుభూతితో ఆటను ఆస్వాదించారు. ప్రేక్షకుల్లేకుండా  జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ స్టోక్స్‌, టీమ్‌ బట్లర్‌ జట్లు బరిలోకి దిగాయి. తొలుత టాస్‌ గెలిచిన స్టోక్స్‌ టీమ్‌...ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గాయం నుంచి కోలుకున్న సీనియర్‌ స్పీడ్‌స్టర్‌ జేమ్స్‌ అండర్సన్‌(2/49) మ్యాచ్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.  

బ్రేసి(85), లారెన్స్‌(58), జో డెన్లీ(48) రాణించడంతో బట్లర్‌ టీమ్‌  5 వికెట్లకు 287 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ బట్లర్‌(24), కరన్‌(15) నాటౌట్‌గా నిలిచారు. ఓవర్టన్‌ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ స్టోక్స్‌  233 పరుగులకు ఆలౌటైంది. క్రావ్లె(43), కెప్టెన్‌  బెన్‌ స్టోక్స్‌(41)  మినహా మిగిలిన వారు విఫమలయ్యారు. బట్లర్‌  టీమ్‌  బౌలర్లలో ఆర్చర్‌, రాబిన్‌సన్‌, బెస్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య ప్రారంభమయ్యే తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ పునరుద్ధరణ జరుగబోతున్నది. కాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్‌ లీవ్స్‌  మ్యాటర్‌ అని రాసి ఉన్న జెర్సీలను వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లండ్‌  క్రికెటర్లు కూడా ధరించనున్నారు.    

సంబురాలు కొత్తగా..

వికెట్లు తీసిన తర్వాత సంబురాల్లో చేసుకోవడంలో ఆటగాళ్లు గతానికి భిన్నంగా వినూత్న రీతిని అవలంభించారు. కరచాలనాలు, హై ఫై, కౌగిలింతలు చేయకుండా మోచేతులను తాకించుకొని సంబురాలు చేసుకున్నారు. మ్యాచ్‌లో అండర్సన్‌ పదేపదే శానిటైజర్‌ను చేతులకు రాసుకుంటూ కనిపించాడు. 

 


logo