మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 20:58:42

పెట్రోలు పోసుకుని దంపతుల ఆత్మహత్యాయత్నం

పెట్రోలు పోసుకుని దంపతుల ఆత్మహత్యాయత్నం

పాలకుర్తి రూరల్‌ : రెవెన్యూ అధికారుల ముందే దంపతులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరులో బుధవారం చోటుచేసుకుంది. బాధితులు చీలూరి స్వప్న, యాదగిరి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూరు గ్రామానికి చెందిన స్వప్న- యాదగిరికి   ఎకరమున్నర వ్యవసాయ భూమి ఉంది. అందులో వాళ్లు గతేడాది బోరు వేశారు. దీంతో తమ వ్యవసాయ భూమి పక్కనే ఉన్న కేమిడి లక్ష్మణ్‌కు వ్యవసాయ బావి ఉంది. బావి పక్కనే బోరు వేశారని గతంలో యాదగిరి దంపతులు, లక్ష్మణ్‌కు గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో లక్ష్మణ్‌ బోరును సీజ్‌ చేయాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ రవి బోరు వద్దకు విచారణకు వెళ్లాడు. దీంతో స్వప్న యాదగిరి దంపతులు తమకు బోరుతోనే జీవనాధారమని బోరు సీజ్‌ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని తమ వద్ద ఉన్న పెట్రోల్‌ను స్వప్న మీద పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పక్క రైతులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. రెవెన్యూ అధికారులు అక్కడినుంచి వెనుదిరిగారు. ఈ విషయమై ఆర్‌ఐను వివరణ కోరగా కేమిడి లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు బోరుపై విచారణకు వెళ్లామని ఆ సమయంలో దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడడంతో వెనుదిరిగామని చెప్పారు.


logo