ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Jul 24, 2020 , 13:52:15

కరోనా భయమే చంపేస్తోంది!

కరోనా భయమే చంపేస్తోంది!

  • కరోనా సోకిందేమోననే భయంతో అధికారి ఆత్మహత్య

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సోకిందేమోననే భయంతో ఓ ప్రభుత్వ అధికారి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. మంచిర్యాలకు చెందిన ఎం. రాజా వెంకటరమణ(54) స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే పట్టణంలో ఆయన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వెంకటరమణ గత కొన్ని రోజులుగా జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చి స్థానికంగా ఓ ప్రైవేట్‌ దవాఖాన వైద్యుడిని సంప్రదించగా..అతను కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించాడు. 

తీవ్ర భయాందోళనకు గురైన వెంకటరమణ గురువారం కార్యాలయానికి హాజరైన తరువాత ఇంటికి వెళ్లకుండా కరీంనగర్‌కు బయల్దేరాడు. అక్కడ క్రిస్టియన్‌ కాలనీలోని తన ఫ్లాట్‌కు వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి కరీంనగర్‌లోని తమ బంధువులను సంప్రదించగా.. వారు వెంకటరమణకు చెందిన ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దవాఖానకు తరలించారు. 

కరోనా భయమే చంపేస్తోంది

ఇదిలా ఉండగా కరోనా సోకి చనిపోవడం పక్కనపెడితే.. అది సోకుతుందేమోనన్న భయమే జనాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ భయంతోనే చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నరు. రెండు రోజుల క్రితమే మహబూబ్‌నగర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిందని ఓ 50 ఏండ్ల వ్యక్తి ఉరి వేసుకున్నాడు. జూలై 12న కాల్ సెంటర్ ఉద్యోగి హైదరాబాద్‌లోని సంతోశ్‌నగర్‌లో తన నివాసంలో కరోనా సోకిందేమోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 5న హైదరాబాద్‌లోని ఒక వ్యాపారి కరోనా వచ్చిందేమోనని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చలి, జ్వరంతో బాధపడుతున్న 34 ఏళ్ల వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మే 2న కరోనా వచ్చిందనే భయంతో హైదరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్‌ 4వ అంతస్తు నుంచి దూకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo