పెండ్లిలో మర్యాదలు చేయలేదని ఘర్షణ..ఒకరు మృతి

యాదాద్రి భువనగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో మర్యాదల విషయంలో తలెత్తిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. దాచారం గ్రామానికి చెందిన తాటిపాముల మహేష్‌కు జనగామ జిల్లా పాకాల గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 2 న దాచారంలో ఇరువురికి వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెండ్లి కొడుకు తరఫున కుల పెద్దగా సూరారం చంద్రయ్య పెండ్లి కుమార్తెను తీసుకొని రావటానికి జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పాకాల గ్రామానికి గ్రామస్థులతో కలిసి మంగళవారం ఉదయం వెళ్లాడు.
అయితే అక్కడ పెండ్లి కూతురు సంబందీకులు భోజనం మర్యాదలు సరిగా చెయ్యలేదంటూ.. కులపెద్దతో దాచారం గ్రామానికి చెందిన సూరారం వెంకటయ్య ఘర్షణ పడ్డాడు. తిరిగి మంగళ వారం రాత్రి దాచారం గ్రామం వచ్చిన తర్వాత మరల అదే విషయంలో సదరు సూరారం వెంకటయ్య గొడవ పడుతుండగా అదే సమయంలో వెంకటయ్య కుమారుడు సూరారం ప్రవీణ్ చేతిలో గొడ్డలి పట్టుకొని వచ్చి నేరుగా కుల పెద్ద చంద్రయ్య ఇంటిలోకి ప్రవేశించి తన చేతిలో ఉన్న గొడ్డలితో చంద్రయ్య కుమారులు అయిన నాగరాజు, పరశురాములులపై దాడి చేశాడు.
దీంతో నాగరాజుకు ఎడమ చేతిపై, పరశురాములుకు తలకు, ఎడమ చెవి కింది భాగాన తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా పరశురాములు మార్గమద్యంలో మృతి చెందాడు. వెంకటయ్య, చంద్రయ్య కుటుంబాల మధ్య ఉన్న పాత గొడవలే ప్రస్తుతం జరిగిన ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు. బుధవారం దాచారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెండ్లి తంతు సజావుగా జరిగింది.
తాజావార్తలు
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు
- వైభవంగా గోదాదేవి కల్యాణం
- టీకాకు సన్నద్ధం
- వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలి
- లక్ష్మీనరసింహ స్వామికి పట్టు వస్ర్తాలు
- హెచ్‌సీఎల్‌లో 20 వేల ఉద్యోగాలు
- హైదరాబాద్-షికాగో నాన్‌స్టాప్
- విప్రోతో ఫియట్ జోడీ
- యాపిల్ ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు