ఆదివారం 24 జనవరి 2021
Crime - Sep 23, 2020 , 13:07:40

యాదాద్రి జిల్లాలో శిశు విక్రయ కలకలం..

యాదాద్రి జిల్లాలో శిశు విక్రయ కలకలం..

యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నది. అయితే అక్కడ స్థానికంగా ఉండే యువకుడిని ప్రేమించి గర్భం దాల్చింది. పెండ్లి చేసుకోవడానికి సదరు యువకుడు  నిరాకరించడంతో ఆ మహిళ నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై యువకుడిని రిమాండ్  కుతరలించారు.  కాగా, గర్భందాల్చిన మహిళ ఈనెల 12వ తేదీన భువనగిరి ఏరియా దవాఖానలో పాపను ప్రసవించింది.

అయితే తెలిసిన వ్యక్తుల ద్వారా పుట్టిన పాపను భువనగిరి శివార్లలో ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద రూ.60 వేలకు తల్లి తరఫున కుటుంబ సభ్యులు విక్రయించారు. అయితే కేసు విచారణలో భాగంగా మహిళను పాపను వెంటబెట్టుకొని రావాలని నేరేడుమెట్ పోలీసులు కోరగా.. పాప చనిపోయింది అని పోలీసులకు తప్పుడు సమాచారం అందించారు. అనుమానం వచ్చిన పోలీసులు ఈ ఘటనపైలోతుగా విచారణ చేపట్టడంతో  పాపను విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాపను విక్రయించిన వారి వద్ద నుంచి తీసుకొచ్చి భువనగిరి పట్టణంలోని చైల్డ్ కేర్ సెంటర్ కు తరలించారు.


logo