శనివారం 11 జూలై 2020
Crime - Jun 03, 2020 , 20:48:51

మోసం చేయడం వాళ్లకు హాబీ.. మోసపోవడం నిత్యం మన వంతు

మోసం చేయడం వాళ్లకు హాబీ.. మోసపోవడం నిత్యం మన వంతు

హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కుకొని నిత్యం మోసపోతున్నా.. వాళ్లు మోసం చేయడం ఆపడం లేదు.. మనం మోసపోకుండా జాగ్రత్త పడటం లేదు. గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌కు జవాబిచ్చి మోసపోకండని, బ్యాంకు వివరాలు చెప్పొద్దంటూ పోలీసులు నెత్తీనోరు బాదుకొంటున్నా.. ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ మొదటికే మోసం వస్తుందని తెలిసినా అగంతకుల మాటలకు దాసోహమైపోతూ పంగనామాలు పెట్టించుకొంటున్నారు. 

బిట్‌ కాయిన్‌ దందాలో డాలర్లను పెట్టుబడిగా పెడితే నాలుగు రోజుల్లో డబుల్‌ ఆదాయాన్ని ఇస్తామని సైబర్‌ దొంగలు ఓ వ్యాపారీని నిండా ముంచారు. బేగంపేటకు చెందిన లలిత్‌ జైన్‌కు సోషల్‌ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి .. బిట్‌కాయిన్‌ దందాలో పెట్టుబడి పెడితే నాలుగు రోజుల్లో రెట్టింపు ఆదాయం చేసి ఇస్తామని బుకాయించాడు. మోసగాడి మాటలు నమ్మిన లలిత్‌ జైన్‌ ఓకే అనడంతో ఓ వెబ్‌సైట్‌ అడ్రస్‌ ఇచ్చాడు. ఆ వెబ్‌సైట్‌ను తెరిచి ఆన్‌లైన్‌లో 7 వేల డాలర్‌లు (మన కరెన్సీలో దాదాపు రూ.5 లక్షలు) పెట్టుబడిగా పెట్టాడు. సదరు వ్యక్తి చెప్పినట్లుగా నాలుగు రోజుల తర్వాత వెబ్‌సైట్‌ను తెరిచి చూస్తే కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ అని చూపించింది. ఎక్కడ కూడా నగదు డబుల్‌ అయినట్లు కనిపించలేదు. తనకు సూచించిన వ్యక్తిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అటు వైపు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన లలిత్‌ జైన్‌.. సీసీఎస్‌ సైబర్‌ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.  

ఉద్యోగం కోసం చూస్తే.. 1.25 లక్షలు కొట్టేశారు

హైదరాబాద్‌ రాంనగర్‌కు చెందిన హరీశ్‌ ఉద్యోగం కోసం ఓ జాబ్‌పోర్టల్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మీ అర్హతలు బాగున్నాయి. మీకు ఉద్యోగం ఖాయం. మేము చెప్పినట్లు రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ఇతర అంశాలకు కొంత డబ్బు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. వారు చెప్పినట్లు హరీశ్‌ దాదాపు రూ.1.25 లక్షలు జమచేశాడు. తీరా వారి నుంచి ఏలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రూపాయి పంపాడు.. రెండున్నర లక్షలు పోగొట్టుకొన్నాడు

మియాపూర్‌ ప్రాంతానికి చెందిన మల్లేష్‌ అనే వ్యక్తికి గత నెల 24న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి.. మీ పేవైటీఎమ్‌ కేవైసీ డాక్యుమెంట్‌ ఈ రోజుతో రద్దవుతున్నందున అప్‌డేట్‌ చేసుకోమని సలహా ఇచ్చాడు. అందుకోసం క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకొని.. అందులో వచ్చిన ఐడీని చెప్పండని సూచించాడు. దీంతో మల్లేష్‌ కంగారు పడి వాళ్లు చెప్పినట్టే చేశాడు. అనంతరం ఏదైనా బ్యాంక్‌ ఖాతా నుంచి 10 రుపాయాలను ఎవరీకైనా పంపించమని చెప్పడంతో మల్లేష్‌ మొదట కార్పోరేషన్‌ బ్యాంక్‌ వివరాలను టైప్‌ చేసి 10 రూపాయాలు పంపాడు. వివరాలు సక్సెస్‌ కాలేదని మరో బ్యాంక్‌ వివరాలను నమోదు చేయాలని చెప్పడంతో.. మల్లేష్‌ హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా వివరాలను టైప్‌ చేసి ఒక రూపాయి తనకు తెలిసిన వారికి పంపాడు. ఆ తర్వాత తన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతా నుంచి రూ.2 లక్షలు, కార్పోరేషన్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.50 వేలు మాయమయ్యాయి. మోసపోయాని గుర్తించి వెంటనే సైబరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.  


logo