ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 09, 2020 , 22:25:49

మెర్సిడెస్ కారు అమ్ముతానంటూ టోకరా

మెర్సిడెస్ కారు అమ్ముతానంటూ టోకరా

బెంగళూరు : లగ్జరీ కారు కొనేందుకు వెళ్లి ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. అడ్వాన్స్ అమౌంట్ అంటూ భారీగా ముట్టజెప్పిన పెద్దాయన.. మూడు నెలల తర్వాత మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. తీరా మోసగాడిపై ఇప్పటికే 30 ఫిర్యాదులు ఉన్నాయని తెలుసుకొని బాధితుడు కండ్లు తేలేసాడు.

బెంగళూరుకు చెందిన ఖలీల్ షరీఫ్ అనే వ్యక్తి తక్కువలో మంచి కారు కొనేందుకు గత కొంతకాలంగా చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో జీవన్ బీమానగర్ లోని గ్యారేజీ, సర్వీస్ స్టేషన్ కు వచ్చాడు. అక్కడున్న ఓ వ్యక్తి తనకు తానుగా దస్తగిర్ అని పరిచయం చేసుకుని.. వ్యక్తి తన వద్ద ఉన్న లగ్జరీ కారును తక్కువ ధరకే అమ్ముతానంటూ ఆశచూపాడు. 2006 మోడల్ మెర్సిడెస్ కారును రూ.2.25 లక్షలు అని చెప్పి బేరసారాలు జరిపి చివరకు రూ.2 లక్షలకు అమ్మేందుకు ఖాయం చేసుకున్నాడు. అందులో భాగంగా మార్చి 11న రూ.78 వేలు అడ్వాన్స్ గా గూగుల్ పే ద్వారా చెల్లించాడు. మంచిరోజులు లేనందున ఎల్లుండి వచ్చి కారు తీసుకెళ్లమని బుకాయించాడు. ఎంతకూ కారు ఇవ్వకపోవడంతో దస్తగిర్ కు ఫోన్ చేయగా.. ఫోన్ స్విచాఫ్ ఉన్నది. లాక్ డౌన్ నేపథ్యంలో వర్క్ షాప్ మూసివుండటంతో రెస్పాన్స్ అందలేదు. మూడు నెలల అనంతరం లాక్ డౌన్ ఎత్తివేయగా గ్యారేజి వద్దకు వెళ్లిన షరీఫ్.. దస్తగిర్ గురించి ఆరాతీశాడు. కారు ఇవ్వకుండా మోసం చేసినట్లు ఉన్నాడంటూ గ్యారేజీ యజమాని డబ్బులు తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చి పంపించేశాడు. అయినప్పటికీ నమ్మకం కుదరకపోవడంతో షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, సదరు దస్తగిర్ అనే వ్యక్తి అప్పటికే 30 మందిని మోసగించాడని పోలీసులు చావు కబురు చల్లగా చెప్పడంతో.. విస్తుపోవడం షరీఫ్ వంతైంది.


logo