సికింద్రాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. ఓ అపార్ట్మెంట్లో పని చేసేందుకు వెళ్తున్న వృద్ధురాలి మెడలోని 15 గ్రాముల బంగారు చైన్‌ను ఆగంతకుడు దొంగిలించుకుపోయాడు. బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీతాఫల్మండి బ్రాహ్మణబస్తీకి చెందిన లక్ష్మి దగ్గరిలోని లక్ష్మి ఎన్‌క్లేవ్‌లో ఓ ఇంట్లో పనిచేస్తుంది. మంగళవారం ఉదయం ఆ వృద్దురాలు ఒంటరిగా పనికి వెళ్తున్న క్రమంలో ఓ ఆగంతకుడు ఆమెను గమనిస్తూ బైక్‌పై ఫాలో అయ్యాడు.
సరిగ్గా అమె పనిచేసే అపార్ట్ మెంట్లోకి వెళ్లి లిఫ్ట్ స్విచ్ నొక్కే సమయంలో అమె వెనకాలే వచ్చిన దుండగుడు ఒక్క సారిగా ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కెల్లాడు. ఈ పెనుగులాటలో లక్ష్మి మెడకు గాయమవడంతోపాటు, లాకెట్ లక్ష్మి చేతిలోనే చిక్కింది. బాధితురాలి ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.