మంగళవారం 02 జూన్ 2020
Crime - Feb 04, 2020 , 08:17:39

మంచి చేయబోయి ఇరుక్కుపోయాడు

మంచి చేయబోయి ఇరుక్కుపోయాడు

హైదరాబాద్: నుమాయిష్‌కు సంబంధించిన సమాచారాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి నుమాయిష్‌ పేరుతో వెబ్‌సైట్‌ను తయారు చేసి కేసులో ఇరుక్కున్నాడు. సొసైటీకి సంబంధించి 2020 వివరాలు నమోదు చేయాల్సి ఉండగా.. గత ఏడాదివే ఉంచడంతో రాద్ధాంతమైంది. దీంతో సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సోమవారం నిందితుడికి నోటీసులు జారీ చేశారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఎర్రగడ్డకు చెందిన మల్లికార్జున రావు కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. ఆటిజంపై అవగాహన కల్పిస్తూ దానిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మల్లికార్జునరావు నిర్ణయించుకొని స్మైల్‌ ఫౌండేషన్‌ అనే సంస్థను స్థాపించి ప్రచారం చేస్తున్నాడు. ఇందులో భాగంగా 2017, 2018లో ఎగ్జిబిషన్‌(నుమాయిష్‌)లో స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశాడు. నుమాయిష్‌ ప్రదర్శనకు ట్రేడ్‌ మార్కు లేకపోవడంతో, మల్లికార్జునరావు  ట్రేడ్‌ మార్కు రిజిస్ట్రేషన్‌ పొందాడు. దీంతో పాటు నుమాయిష్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశాడు. నుమాయిష్‌కు సంబంధించిన సమాచారాన్ని అందులో ఉంచాలని భావించి... ఎగ్జిబిషన్‌ సొసైటీకి సంబంధించిన సమాచారాన్ని 2020 సంవత్సరానికి గాను 2019 సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు. 2019లో 2900 దుకాణాలకు సొసైటీ ప్రకటన జారీ చేసింది. గత ఏడాది అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణం పరిమితికి మించి దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 

అయితే 2020లో ఎగ్జిబిషన్‌ సొసైటీ 1500 దుకాణాల ఏర్పాటుకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనిని గుర్తించకుండా, నుమాయిష్‌ వెబ్‌సైట్‌లో 2019కి సంబంధించిన 2900 దుకాణాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వివరాలను మల్లిఖార్జునరావు పొందు పరిచాడు. ఎగ్జిబిషన్‌ సొసైటిదే ఆ వెబ్‌సైట్‌ అని భావించిన ఓ వ్యక్తి హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడంతో కోర్టు ఎగ్జిబిషన్‌ సొసైటీని ప్రశ్నించింది. దీంతో నుమాయిష్‌ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం తమది కాదంటూ సొసైటీ నిర్వాహకులు కోర్టుకు చెప్పారు. ఇదిలాఉండగా తమ అనుమతి లేకుండా వెబ్‌సైట్‌లో పాత సమాచారాన్ని పొందుపరిచి, దానిని దుర్వినియోగం చేశారంటూ సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు  మల్లికార్జున్‌రావు దీనికి బాధ్యుడని తేల్చి, సోమవారం సైబర్‌క్రైమ్‌ ఠాణాకు పిలిపించి, అతని వాంగ్మూలం నమోదు చేశారు, అనంతరం అతనికి సీఆర్పీ41(ఎ) ప్రకారం నోటీసులు జారీ చేశారు. 


logo