మంగళవారం 19 జనవరి 2021
Crime - Dec 03, 2020 , 18:05:41

విశాఖ నుంచి మహారాష్ర్టకు గంజాయి స్మగ్లింగ్‌

విశాఖ నుంచి మహారాష్ర్టకు గంజాయి స్మగ్లింగ్‌

సంగారెడ్డి : విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమంగా మహారాష్ర్టకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని 436 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజు తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ డీఎస్పీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లాలోని నర్సపట్నం ఏజెన్సీ నుంచి అక్రమంగా గోలిగొండ మండలానికి చెందిన కర్రీ కృష్ణ, బొబ్బిలి బెన్నయ్య నాయుడు గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారన్నారు. 

హద్నూర్‌ ఎస్సై విజయ్‌రావు తన సిబ్బందితో కలసి జహీరాబాద్‌-బీదర్‌ రోడ్డుపై శంశోల్లాపూర్‌ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తుండగా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడన్నారు. లారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీ నుంచి అక్రమంగా గంజాయిని 10 కిలోల చొప్పున ప్యాక్‌ చేసి 106 ప్యాకెట్లు స్మగ్లింగ్‌ చేస్తురన్నాన్నారు.

మొత్తం 436 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని, మార్కెట్‌లో ఈ గంజాయి విలువ రూ.43.60 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ తరలింపు పై పూర్తి విచారణ చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జహీరాబాద్‌ పట్టణ,రూరల్‌ సీఐలు రాజశేఖర్‌, కృష్ణాకిశోర్‌, రాయికోడ్‌ ఎస్సై ఏడుకొండల్‌ సిబ్బంది ఉన్నారు.