బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 19:21:08

టెడ్డీ బేర్‌లో హెరాయిన్‌ అక్రమ రవాణా.. క్యాబ్‌ డ్రైవర్‌ అరెస్ట్‌

టెడ్డీ బేర్‌లో హెరాయిన్‌ అక్రమ రవాణా.. క్యాబ్‌ డ్రైవర్‌ అరెస్ట్‌

బెంగళూరు: టెడ్డీ బేర్ బొమ్మ లోపల యాబా టాబ్లెట్లు, హెరాయిన్ పౌడర్‌ను అక్రమంగా రవాణా చేస్తున్న క్యాబ్ డ్రైవర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కాంట్రాబ్యాండ్ ధర సుమారు రూ.28 లక్షలు అని పోలీసులు తెలిపారు. నిందితులు అసోం నుంచి బెంగళూరుకు డ్రగ్స్‌ తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు క్యాబ్‌ డ్రైవర్‌ను ఉల్సూర్‌ గ్రామానికి చెందిన సకీర్ హుస్సేన్ చౌదరిగా గుర్తించారు. 

నిందితుడు తన భార్య, పిల్లలతో అసోం వెళ్లాడు. అక్కడ బంగ్లాదేశ్‌ నుంచి రవాణా అయిన మాదకద్రవ్యాలను టెడ్డీ బేర్‌లో నింపి తన పిల్లలకు అప్పగించాడు. డిసెంబర్ 3 సాయంత్రం 4.20 గంటల సమయంలో ఓల్డ్ మద్రాస్ రోడ్‌లోని ఎంవీ గార్డెన్‌లోని చెక్‌పాయింట్ సమీపంలో చౌదరి క్యాబ్‌ను ఉల్సూర్ పోలీసులు అడ్డగించారు. టెడ్డి బేర్‌ను దాచడానికి నిందితుడు తీవ్రంగా ప్రయత్నించడంతో అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించి ఆయన కారును తనిఖీ చేశారు. కారులో లభించిన టెడ్డీ బేర్‌ను తనిఖీ చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. రూ.22 లక్షల విలువైన 2,200 యాబా టాబ్లెట్లు, రూ.6 లక్షల విలువైన 71 గ్రాముల హెరాయిన్ పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సకీర్‌ హుస్సేన్‌ డ్రగ్స్ అమ్ముతున్నట్లు తమకు తెలియదని నిందితుడి కుటుంబ సభ్యులు చెప్పడం విశేషం.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo