ముంబై : ఆన్లైన్ కోడింగ్ క్లాసుల్లో మహిళా టీచర్లకు తన ప్రైవేట్ భాగాలను చూపుతూ అసభ్యంగా వ్యవహరించిన తొమ్మిదో తరగతి విద్యార్ధి(15)ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రక్షణ శాఖ ఉద్యోగి కుమారుడైన నిందితుడికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 మధ్య ఈ-కోడింగ్ లెక్చర్స్ సందర్భంగా నిందితుడు పలుమార్లు మహిళా టీచర్ల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడు. ఆన్లైన్ క్లాసుకు హాజరయ్యేవారు తమ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది.
నిందితుడు పలుమార్లు అశ్లీలంగా ప్రవర్తించడంతో కోడింగ్ ఇన్స్ట్రక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును పరిశోధించిన పోలీసులు నిందితుడు రాజస్ధాన్ లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. నిందితుడి ల్యాప్ టాప్ పరిశీలించగా దాని ఐపీ అడ్రస్ ట్రాక్ కాకుండా జాగ్రత్త పడ్డట్టు పోలీసులు గుర్తించారు.
తన ముఖం స్క్రీన్ పై కనిపించకుండా బాలుడు జాగ్రత్త పడినా కెమెరా కంట పడకుండా తప్పించుకునే క్రమంలో ఓ ఇన్ స్ట్రక్టర్ బ్యాక్ గ్రౌండ్ ను స్క్రీన్ షాట్ తీయడం అతడిని పట్టిఇచ్చేందుకు పోలీసులకు సహకరించింది. మహిళా ఇన్స్ట్రక్టర్ల పట్ల ఎందుకు ఇలా వ్యవహరించావని పోలీసులు బాలుడిని అడగ్గా కేవలం వినోదం కోసమే ఇదంతా చేశానని చెప్పడం గమనార్హం. టీనేజ్ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బాలల కోర్టులో ప్రవేశపెట్టగా ఆపై అతడిని అబ్జర్వేషన్ హోంకు తరలించారు.