బుధవారం 25 నవంబర్ 2020
Crime - Oct 31, 2020 , 22:44:51

ఏసీబీ వ‌ల‌లో బోధ‌న్‌ సీఐ, ఎస్ఐ

ఏసీబీ వ‌ల‌లో బోధ‌న్‌ సీఐ, ఎస్ఐ

నిజామాబాద్ : అవినీతికి పాల్ప‌డుతూ బోధ‌న్ స్టేష‌న్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏసీబీ అధికారుల‌కు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయ‌కుండా ఉండాలంటే రూ. ల‌క్ష విలువైన సెల్‌ఫోన్ అదేవిధంగా రూ. 50 వేల న‌గ‌దును లంచంగా డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. అధికారులు వ‌ల‌ప‌న్నీ ఇరువురిని ట్రాప్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సీఐ ప‌ల్లె రాకెశ్‌, ఎస్ఐ మొగిల‌య్య‌, డ్రైవ‌ర్ గంగాధ‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. 

బోధన్‌కు చెందిన సాజిద్ అహ్మద్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వ‌ల‌ప‌న్నీ వీరిని ప‌ట్టుకున్నారు. సుద‌ర్శ‌న్ గౌడ్ అనే వ్య‌క్తికి చెందిన భూమిలోని కొంత భాగాన్ని సాజిద్ కొనాలని అనుకున్నాడు. ఈ ఒప్పందం గురించి చర్చించేందుకు సుద‌ర్శ‌న్ ఇంటికి వెళ్లాడు. అయితే అక్క‌డ ఇరువురి మ‌ధ్య కొంత వాదన చోటుచేసుకుంది. త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌లో సాజిద్‌కు గాయాలు సైతం అయ్యాయి. తన ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను తీసుకెళ్లేందుకు సైతం గౌడ్ అనుమ‌తించ‌లేదు. దీంతో సాజిద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించి సుద‌ర్శ‌న్ గౌడ్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి బైక్‌ను స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చారు.

కానీ ఆ బైక్‌ను అప్ప‌గించేందుకు సాజిద్ వ‌ద్ద నుండి డ‌బ్బులు డిమాండ్ చేశారు. దీనికి సాజిద్ నిరాక‌రించాడు. దీంతో సీఐ రాకేశ్‌, ఎస్ఐ మొగిల‌య్య ఇరువురు సాజిద్‌పై కౌంట‌ర్ ఫిర్యాదు చేయడానికి సుద‌ర్శ‌న్ గౌడ్‌ను ప్రేరేపించారు. క్రిమిన‌ల్ కేసు బుక్ చేయొద్దంటే రూ. 2 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేశారు. విసిగివేసారిన సాజిద్ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. అధికారులు వ‌ల‌ప‌న్నీ సీఐ, అత‌ని డ్రైవ‌ర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు.