సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 21:19:17

చంబల్‌లో పడవ మునక.. 11కు చేరిన మృతుల సంఖ్య

చంబల్‌లో పడవ మునక.. 11కు చేరిన మృతుల సంఖ్య

బుండి : రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో సుమారు 30 మంది భక్తులతో ఆలయానికి వెళ్తున్న పడవ బుధవారం ఉదయం చంబల్ నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకోగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 16 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగా.. మరో ముగ్గురు ఆచూకీ తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

కోటలోని ఖటోలి ఇటవా ప్రాంతానికి చెందిన భక్తులు ప్రార్థనలు చేయడానికి బుండీ ఇందర్‌గర్‌లోని కమలేశ్వర్ ఆలయానికి వెళ్తున్నట్లు తెలిసింది. ఖటోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోత్రా గ్రామ సమీపంలో ఉదయం 8.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పడవ బోల్తాపడిన చోట నది లోతు సుమారు 40 నుంచి 45 అడుగుల వరకు ఉంటుందని సమాచారం. పడవ పడిన వెంటనే పోలీసుల సమాచారం మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారని జిల్లా కలెక్టర్ ఉజ్జవాల్ రాథోడ్ తెలిపారు. పడవ శిథిలావస్థలో ఉండడంతోనే ప్రయాణికులు బరువుకు బోల్తా కొట్టినట్లు అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు. పడవ నడిపేవాడితో పాటు యజమానిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ శుభకరన్ తెలిపారు.

మృతుల కుటుంబాలకు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ట్విట్టర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఒక్కొక్కిరికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo