సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 07, 2020 , 18:34:06

భోపాల్ హ‌నీ ట్రాప్ కేసు.. ఫిర్యాదుదారుల‌తో పాటు నిందితులూ మిస్సింగ్‌!

భోపాల్ హ‌నీ ట్రాప్ కేసు.. ఫిర్యాదుదారుల‌తో పాటు నిందితులూ మిస్సింగ్‌!

భోపాల్ : నగరాన్ని కదిలించిన హ‌నీ ట్రాప్ కేసులో భోపాల్ క్రైమ్ బ్రాంచ్ ఓ యూట్యూబ్ న్యూస్ ఛానల్ యజమాని, దాని ఎడిటర్‌ను అరెస్టు చేసింది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్‌ను కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. 

మొద‌ట మహిళా రిపోర్టర్‌పై ఫిర్యాదు చేసిన డాక్టర్ దీపక్ మరవిపై సెక్షన్ 354 కింద క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది. అయితే ఆ మ‌హిళా రిపోర్ట‌ర్ ఇప్ప‌డు క‌న‌బ‌డ‌కుండా పోయింది. మహిళపై ఫిర్యాదు చేయ‌డానికి మొద‌ట‌ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించిన దీపక్ మరవి కూడా క‌న‌ప‌డ‌కుండా పోయాడు. "అవును మేము ఇప్పుడు డాక్టర్ మరవి, మహిళా రిపోర్టర్ ఇద్దరి కోసం వెతుకుతున్నాం. వారిద్దరూ తప్పిపోయారు, వారిద్ద‌రూ ఇప్ప‌డు వేర్వేరు కేసుల్లో నిందితులు. మహిళా రిపోర్టర్, మరో నలుగురు కిడ్నాప్, బ్లాక్ మెయిలింగ్ కేసులో నిందితులుగా ఉన్నారు. డాక్టర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు" అని అదనపు ఎస్పీ (క్రైమ్ బ్రాంచ్) గోపాల్ సింగ్ చెప్పారు.

వైద్యం కోసం మహిళా రిపోర్టర్ డాక్ట‌ర్ దీపక్ మరవిని సంప్రదించినట్లు గోపాల్ ధక్కర్ తెలిపారు. మొదటి సమావేశంలోనే వీరిద్ద‌రూ తమ ఫోన్ నెంబ‌ర్ల‌ను తీసుకొని చాటింగ్ చేయ‌డం ప్రారంభించిన‌ట్లు పేర్కొన్నారు. మహిళా రిపోర్టర్ అన్ని సందేశాల‌ను రికార్డు చేసి ఉంచి.. బనలాల్ సింగ్ రాజ్‌పుత్, అవదేశ్ శర్మ, ఒక మహిళా సహోద్యోగితో కలిసి దీపక్ మరవిని కిడ్నాప్ చేసి అతడి నుంచి రూ .50 లక్షలు వసూలు చేయాల‌ని ప్లాన్ వేసింది. 

ఆగస్టు 29న మహిళా రిపోర్టర్ బనలాల్, అవదేశ్ సహా నలుగురు పురుషుల‌తో డాక్టర్ క్లినిక్‌కు వెళ్లింది. అక్క‌డ నుంచి వైద్యుడిని త‌మ ఇంటికి తీసుకెళ్లింది. అక్క‌డ అత‌డిని బంధించి రూ.50 లక్షలు ఇవ్వాల‌ని లేకుంటే త‌న‌తో చేసిన చాటింగ్ బ‌య‌ట‌పెడ‌తాన‌ని బెదిరించింది. అయితే ఈ మొత్తాన్ని ఏర్పాటు చేయడానికి డాక్టర్ 24 గంటల సమయం కోరాడు. త‌రువాత దీప‌క్ మ‌ర‌వి క్రైమ్ బ్రాంచ్‌కు సమాచారం అందించాడు. పోలీసులు ఈ కేసులో మ‌హిళా రిపోర్ట‌ర్‌ను అరెస్టు చేయ‌డానికి ముందు ఆమె డాక్ట‌ర్‌తో సంభాష‌ణ‌ల రికార్డుల‌ను వారికి అంద‌జేసి వైద్యుడిపై ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో వైద్యుడితో పాటు మ‌హిళా రిపోర్ట‌ర్ కూడా త‌ప్పిపోయిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo