బుధవారం 20 జనవరి 2021
Crime - Nov 01, 2020 , 15:06:00

అద్దె చెల్లించలేదని మహిళను కత్తితో పొడిచిన ఓనర్‌

అద్దె చెల్లించలేదని మహిళను కత్తితో పొడిచిన ఓనర్‌

బెంగళూరు: ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఆగ్రహించిన యజమానురాలు కిరాయి ఉంటున్న మహిళపై కత్తితో దాడి చేసింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణ ఘటన జరిగింది. రాజగోపాల్‌ నగర్‌కు చెందిన మహాలక్ష్మీ అనే మహిళ తన ఇంటిని పూర్ణిమ, రవిచంద్ర అనే దంపతులకు ఏడాది కిందట అద్దెకు ఇచ్చింది. వారు అడ్వాన్స్‌గా రూ.65 వేలు చెల్లించారు. ప్రతి నెలా రూ.6 వేలు అద్దె చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే కరోనా కారణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్న రవిచంద్ర జాబ్‌ కూడా పోయింది. దీంతో గత నాలుగు నెలలుగా ఆ కుటుంబం అద్దె చెల్లించలేకపోయింది. 

ఈ నేపథ్యంలో ఇంటి ఓనర్‌ మహాలక్ష్మీ శుక్రవారం రాత్రి వారిని నిలదీసింది. నాలుగు నెలల అద్దె రూ.24 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది. తనకు ఇప్పుడే మరో ఉద్యోగం వచ్చిందని ఒక నెల ఓపిక పట్టాలని రవిచంద్ర కోరాడు. మహాలక్ష్మీ వినిపించుకుకోకపోవడంతో తమ అడ్వాన్స్‌ నుంచి అద్దెను మినహాయించుకోవాలని ఆయన భార్య పూర్ణిమ చెప్పింది. అంతకు మించి తాము ఏమీ చేయలేమని అనడంతో ఓనర్‌ మహాలక్ష్మీ ఆగ్రహంతో ఊగిపోయింది. వెంటనే కిచన్‌లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చి పూర్ణిమ చేయి, మెడపై పొడిచింది. ఇంతలో రవిచంద్ర ఆమెను అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఓనర్‌ మహాలక్ష్మీని అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం కింద ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo