శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 12:01:47

ఆత్మరక్షణ కోసం తండ్రిపై కత్తితో కూతురు దాడి

ఆత్మరక్షణ కోసం తండ్రిపై కత్తితో కూతురు దాడి

బెంగళూరు : ఓ తండ్రి మద్యం మత్తులో కూతురిపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. అప్రమత్తమైన కూతురు కూడా తన ప్రాణాలను కాపాడేందుకు ఓ అడుగు ముందుకు వెళ్లింది. మరో కత్తితో తండ్రి కడుపులో గుచ్చింది. దీంతో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

ఓ వ్యక్తి(46) వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 2012లో ఇంజినీర్‌ భార్య చనిపోయింది. అప్పటికే ఆ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య చనిపోవడంతో.. పిల్లల బాధ్యతను ఇంజినీరే చూసుకుంటున్నాడు. ఆయనకు మ్యూజిక్‌ అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో అప్పుడప్పుడు పియానో వాయిస్తుంటాడు. 

ఈ క్రమంలో బుధవారం రాత్రి తన పదిహేను సంవత్సరాల కూతురు ఓ గదిలో చదువుకుంటోంది. తండ్రేమో మరో గదిలో పియానో గట్టిగా వాయిస్తున్నాడు. వాల్యూమ్‌ తగ్గించమని తండ్రిని కోరింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి.. కుమార్తెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కత్తితో ఆమెపై దాడి చేసేందుకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం ఆమె కూడా మరో కత్తితో తండ్రి కడుపులో గుచ్చింది. అనంతరం గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది కూతురు.

తండ్రేమో తన గదిలోకి గాయాలతోనే వెళ్లాడు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొమ్మిదేళ్ల కుమారుడు నిద్ర లేచి చూసేసరికి తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో ఆ అబ్బాయి తన సోదరితో పాటు సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్పటికే ఆ ఇంజినీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

600 విస్కీ బాటిల్స్‌.. 500 పుస్తకాలు లభ్యం

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మృతుడి ఇంటిని పోలీసులు పరిశీలించారు. ఇంట్లో 600 ఖాళీ విస్కీ బాటిల్స్‌ దర్శనమిచ్చాయి. 500 పుస్తకాలు కూడా ఉన్నాయి. అవన్నీ మ్యాథ్స్‌, సైన్స్‌కు సంబంధించినవి అని పోలీసులు తెలిపారు. లక్ష రూపాయాల విలువ చేసే రెండు ఎలక్ట్రానిక్‌ కీబోర్డ్స్‌ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మూడు కుక్కలు కూడా ఉన్నాయి.


logo