ఆదివారం 25 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 13:50:02

ప్రేమించిన యువతిపై బీరు బాటిల్ తో దాడి

ప్రేమించిన యువతిపై బీరు బాటిల్ తో దాడి

నల్లగొండ : ఓ యువకుడు ప్రేమించిన యువతిపై దాడి చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లాలోని చింతపల్లి మండలం కిష్టరాంపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని తెలిసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టరాంపల్లికి చెందిన శివ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకున్నారు.

ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు యువకుడిని మందలించారు. కొంతకాలం ఇద్దరూ ఎవరంతట వాళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ శివ సదరుయువతిని కలిసి పెండ్లి కోసం ఒత్తిడి తెచ్చాడు. ఇదే విషయంలో ఈ రోజు ఉదయం గ్రామ శివారులోని మర్రిగూడెం రోడ్డులో ఇద్దరి మధ్య వాగ్వావాదం జరిగినట్లు తెలిసింది. ఆవేశంతో శివ యువతి తలపై బీరు సీసాతో బలంగా కొట్టాడు.

దీంతో అమ్మాయి అక్కడే స్పృహ కోల్పోయింది. చనిపోయిందని భయపడిన శివ గ్రామంలోకి వెళ్లి తాను వాటర్ ట్యాంక్ ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఇద్దర్నీ దవాఖానకు తరలించారు. యువతి తలకు గాయం కావడంతో మర్రిగూడెం దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. శివ కాళ్లు విరిగి పరిస్థితి సీరియస్ గా మారడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు దాఖానకు తరలించారు. పోలీసులు  కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. logo